Bomb Blast in TMC Office: తృణమూల్ పార్టీ ఆఫీస్‌లో బాంబు పేలుడు,పలువురికి తీవ్ర గాయాలు
Bomb Blast in TMC Office: హౌరాలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాంబు పేలుడు సంభవించింది.
Bomb Blast in TMC Office:
దాడి చేశారంటున్న తృణమూల్..
పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో బాంబు పేలుడు ఘటన సంచలనమైంది. హౌరాలోని జగత్‌బల్లభపూర్ పోల్‌గుస్తియా ప్రాంతంలోని ఆఫీస్‌లో ఈ పేలుడు సంభవించింది. ఆదివారం రాత్రి (ఏప్రిల్ 9) ఉన్నట్టుండి పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. పార్టీ ఆఫీస్‌లో బాంబు పేలిందని గుర్తించారు. అయితే...ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం రాత్రి 8.30 నిముషాలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆఫీస్ బయట బైక్‌లతో వీరంగం సృష్టించారు. బాంబులు విసిరి వెంటనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై తృణమూల్ స్పందించింది. ఈ పని చేసింది ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ISF) అని ఆరోపిస్తోంది. ఆ సంస్థ కార్యకర్తలే బాంబులు విసిరి ఉంటారని చెబుతోంది. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే...అదే ప్రాంతంలో ISF కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ మీటింగ్ పూర్తైన తరవాతే కావాలనే ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారని ఆరోపిస్తోంది TMC.ఈ పేలుడు సంభవించిన సమయంలో పార్టీ ఆఫీస్‌లో తృణమూల్ యూత్ ప్రెసిడెంట్ షేక్ నిజామ్ ఉన్నారు. ఈ దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ మొదలు పెట్టారు. అటు ISF మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తోంది. తృణమూల్ పార్టీ కార్యకర్తలే ఈ దాడి చేసి తమపై నిందలు వేస్తున్నారంటూ మండి పడుతోంది. ఈ దాడి వెనక ఎవరు ఉన్నది త్వరలోనే తేలుస్తామని పోలీసులు వెల్లడించారు.