Jupiter And Venus: అత్యంత సమీపంలోకి రానున్న గురు, శుక్ర గ్రహాలు, ఎప్పుడు జరుగుతుందంటే?
Jupiter And Venus: మార్చి 1వ తేదీన ఖగోళంలో అద్భుతం జరగనుంది. గురు, శుక్ర గ్రహాలు తాకుతున్నాయా అనుకునేలా రోదసిలో దృశ్యం కనిపించనుంది.
Jupiter And Venus: ఖగోళ ఓ అద్భుతాల నిలయం. ఎన్నో వింతలు, ఆలోచనలకు కూడా అందని విషయాలు, అంశాల నిలయం మన విశ్వం. ఈ విశాల విశ్వం మనిషి ఆలోచనలకు, ఊహలకు కూడా అందని ఎన్నో అద్భుతమైన వింతలు జరుగుతుంటాయి. ఖగోళం ఓ అంతులేని అద్భుతమైన, ఆశ్చర్యకరమైనది. అలాంటి ఖగోళంలో ఎప్పుడూ ఏదో ఒక వింత, వావ్ అనిపించే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. భూమికి ఎన్నో వేల కాంతి సంవత్సరాల దూరంలో ఈ అద్భుతాలు శాస్త్రవేత్తలను ఎప్పటికప్పుడు మైమరిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఓ అరుదైన ఘట్టం ఇప్పుడు జరగనుంది.
మార్చి 1వ తేదీన అద్భుతం
మార్చి 1వ తేదీన రోదసిలో ఓ అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించనుంది. మార్చి 1వ తేదీ అంటే బుధవారం రోజు ఆకాశంలో అత్యంత అద్భుతమైన ఘటన జరగనుంది. రెండు గ్రహాలు ఒకదానితో ఒకటి తాకుతున్నాయా అనేలా కనిపించనున్నాయి. గురు, శుక్ర గ్రహాలు ఒకదానితో ఒకటి ఆనుకున్నంత సమీపంలోకి వచ్చాయా అని భ్రమ పడేలా ఈ దృశ్యం కనువిందు చేయనుంది.
తాకుతున్నాయా అనుకునేంతగా..
అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహాలు శుక్రుడు, గురు గ్రహాలు. తక్కువ కాంతి కాలుష్యంతో సులభంగా గుర్తించవచ్చు. గురు శుక్ర గ్రహాలు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో చంద్రునికి దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు గ్రహాలు 0.5 డిగ్రీల కోణంలో అత్యంత దగ్గరగా కనిపించనున్నాయి.
ఎప్పట్లాగే దూరంలోనే, కానీ దగ్గరగా..
ఈ రెండు గ్రహాలు ఎప్పట్లాగే కోట్లాది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అయితే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న ఒకానొక సమయంలో భూమి నుంచి చూస్తే ఇవి రెండు అతి దగ్గరగా వచ్చినట్లు కనిపించనున్నాయి. రెండు వేర్వేరు కక్ష్యల్లో గ్రహాలు ఇలా ఒక కోణం నుంచి చూస్తే ఒకే దగ్గర తాకుతూ ఉన్నట్లు కనిపించడం సాధారణంగా జరిగే ప్రక్రియే.
మిరుమిట్లు గొలిపే శుక్ర గ్రహం
ఫిబ్రవరి ప్రారంభంలో రెండు గ్రహాలు 29 డిగ్రీల వ్యత్యాసంతో తిరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు వాటి మధ్య 2.3 డిగ్రీలకు తగ్గింది. మార్చి 1వ తేదీన గురు గ్రహం -2.1 పరిమాణంతో ప్రకాశవంతంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. ఇది శుక్ర గ్రహం వద్ద -4.0 డిగ్రీల వద్ద కనిపించనుంది. మన సౌర కుటుంబంలో సూర్యుడు, చంద్రుడి తర్వాత మిరుమిట్లు గొలిపే గ్రహం శుక్రుడు. శుక్ర గ్రహాన్ని కొన్ని సార్లు పగటి పూట కూడా చూడొచ్చు. ఇది భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం. శుక్ర గ్రహంపై దట్టమైన మేఘాలు ఉంటాయి. ఈ మేఘాలు సూర్య రశ్మిని ప్రతిబింబిస్తాయి. అలా శుక్ర గ్రహం మిరుమిట్లు గొలుపుతుంది.
శుక్ర, గురు గ్రహాలు ఎందుకలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి?
శుక్ర గ్రహం దాదాపు భూమికి సమానమైన పరిమాణం, సాంద్రత కలిగిన గ్రహం. ఈ గ్రహం సాపేక్షంగా భూమికి దగ్గరగా ఉంటుంది. దీనిపై ఉండే దట్టమైన మేఘాలు సూర్యరశ్మిని ప్రతిబింబిస్తాయి. గురు గ్రహం దాని పరిమాణం కారణంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.