KTR: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహిద్దాం: కేటీఆర్
సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహిద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహిద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు.
అదే రోజు (సెప్టెంబర్ 2) డిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్టీ ఎమ్యెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలంతా ఢిల్లీకి పయనమవుతారు. ఈ నేపథ్యంలో జెండా పండుగ విజయవంతం అయ్యేలా స్థానిక పార్టీ శ్రేణులు కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ నియోజవర్గ ఇన్‌చార్జ్‌లు, సీనియర్ నేతలు సమన్వయం చేసుకోవాలని కోరారు.
సభ్యత్వం తీసుకున్న వారంతా వచ్చేలా..
ఎల్లుండి జరగబోయే పార్టీ జెండా పండగ కార్యక్రమానికి సంబంధించి కేటీఆర్ పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డుల పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులను కోరారు. సభ్యత్వం తీసుకున్న వారందరికీ ముందస్తుగానే సమాచారం అందించి వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
సెప్టెంబర్ నెలాఖరులోగా కమీటీల నియామకాలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న టీఆర్ఎస్ గ్రామ, మండల, జిల్లా, బస్తీ, డివిజన్ కమిటీల కూర్పు విషయంలో కేటీఆర్ పలు సూచనలు చేశారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారికే కమిటీలలో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తప్పనిసరిగా 50 శాతం ఉండాలని, లేని పక్షంలో ఆ కమిటీలు చెల్లవని పేర్కొన్నారు. అన్ని కమిటీల్లో మహిళా కార్యకర్తలకు తగిన స్థానం కల్పించాలని మంత్రి సూచించారు.
సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు.. సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల కమిటీలు, సెప్టెంబర్ 20 తర్వాత జిల్లా కమిటీల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరంలో బస్తి కమిటీలు, డివిజన్ కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా అన్ని కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు.