Amritpal Singh: ఇంత మంది ఉండి ఏం లాభం? ఒక్కడిని పట్టుకోలేరా? పంజాబ్ పోలీసులపై ఆ సంస్థ అసహనం
Amritpal Singh: అమృత్ వెంటనే పోలీసులకు లొంగిపోవాలని అకల్ తక్త్ సంస్థ పిలుపునిచ్చింది.
Amritpal Singh Arrest Operation:
గాలిస్తున్న పోలీసులు..
ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. పంజాబ్‌తో పాటు దాదాపు 8 రాష్ట్రాలు ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నాయి. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు అమృత్. ఈ క్రమంలోనే... సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే అకల్ తక్త్ (Akal Takht) నుంచి అమృత్‌పాల్‌కు పిలుపు వచ్చింది. జతేందర్ గియాని హర్‌ప్రీత్ సింగ్ కీలక సూచన చేశారు. పోలీసుల ముందు లొంగిపోయి పోలీసుల విచారణకు సహకరించాలని కోరారు. ఇదే సమయంలో పోలీసులు అమృత్‌ను పట్టుకోలేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అంత మంది ఉండి కూడా ఇప్పటి వరకూ ఆచూకీ కనుక్కోలేకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
"ఒకవేళ అమృత్ పాల్ పోలీసుల కళ్లు గప్పి ఎక్కడికైనా వెళ్లిపోయుంటే..అతనికి నా విజ్ఞప్తి ఒక్కటే. వెంటనే వచ్చి పోలీసులకు లొంగిపోవాలి. విచారణకు సహకరించాలి"
- జతేందర్ గియాని హర్‌ప్రీత్ సింగ్, అకల్ తక్త్
ఎన్నో అక్రమాలు..
వారిస్ పంజాబ్ దే సంస్థను అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. మార్చి 18 నుంచి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న అమృత్ పాల్ సింగ్...పలు వాహనాలు మార్చాడు. ఇప్పటికే అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీరిపై కేసులు పెట్టారు. పోలీసులు సరిగ్గా పని చేసుంటే ఈ పాటికే అమృత్ అరెస్ట్ అయ్యేవాడని జతేందర్ అన్నారు. అయితే...అమృత్ పాల్ సింగ్ తల్లిదండ్రులు మాత్రం పోలీసులు తన కొడుకుని కచ్చితంగా అరెస్ట్ చేసే ఉంటారని చెబుతున్నారు. అమృత్ అనుచరుల్లో కొందరు ఎలాంటి నేరాలూ చేయలేదు. కేవలం మతపరమైన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నట్టు తెలుస్తోంది. అలాంటి వారిని విచారించి వెంటనే విడిచి పెడుతున్నారు పోలీసులు. ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు పంజాబ్‌లోని 60-70 సిక్ సంస్థలతో సమావేశమయ్యేందుకు అకల్ తక్త్ సిద్ధమవుతోంది. అమృత్ పాల్ సింగ్‌పై నిఘా వర్గాల రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దుబాయ్‌లో లగ్జరీ లైఫ్ గడిపే వాడని, థాయ్‌లాండ్‌కు తరచూ వెళ్లొచ్చే వాడని వెల్లడైంది. భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను హౌజ్ అరెస్ట్ చేశాడని, తీవ్రంగా కొట్టేవాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరికీ వివాహమైంది. అప్పటి నుంచి ఆమెను వేధిస్తూనే ఉన్నాడని చెప్పాయి. అమృత్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ పోలీసులు అమృత్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను ప్రశ్నించారు. Waris Punjab De పార్టీకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో విచారించారు. అమృత్ పాల్ ఎప్పుడూ ఎవరితోనూ తన గతం గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడేవాడు. 2002 వరకూ దుబాయ్‌లోనే ట్రక్ డ్రైవర్‌గా పని చేశాడు. ఇక్కడికి వచ్చిన వెంటనే రాజకీయాల్లోకి దిగిపోయాడు. వారిస్ పంజాబ్ దే పార్టీ చీఫ్‌గా ఎదిగాడు. తరచూ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. మరో సంచలన విషయం ఏంటంటే...అక్కడ ప్రాస్టిట్యూషన్ చేసినట్టు అనుమానాలున్నాయి. అంతే కాదు. అక్కడ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్టూ తెలుస్తోంది.
Also Read: Russia Nuclear Weapons: అణ్వాయుధాలు బయటకు తీయనున్న రష్యా? అక్కడే దాచి పెడుతుందట!