Top Headlines Today: బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై టాక్ ఏంటీ? ఏపీలో ప్రభుత్వంపై వెదర్ ఎఫెక్ట్- టాప్ టెన్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై టాక్ ఏంటీ?
భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారు.కొద్ది రోజులుగా ఈ మేనిఫెస్టోపై కేటీఆర్, హరీష్ రావు అంచనాల పెంచుతూ వస్తున్నారు. ప్రతిపక్షాలకు కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యే మేనిఫెస్టో ప్రకటిస్తారని హరీష్ రావు తరచూ చెప్పారు. అందుకే కేసీఆర్ ఎలాంటి పథకాలు ప్రకటిస్తారోనన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. రైతులకు పెన్షన్ సహా అనేక కొత్త కొత్త పథకాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను చూసిన వారికి కాంగ్రెస్ మేనిఫెస్టోకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది తప్ప.. కొత్త విషయాలేం కనిపించలేదన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రభుత్వానికి ఉక్కపోత
ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. విద్యుత్ డిమాండ్‌కు తగ్గ అవసరాన్ని డిస్కంలు తీర్చ లేకపోతున్నాయి. దీంతో అప్రకటిత కోతలను డిస్కంలు విధిస్తున్నాయి. లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కోతలు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. లోడ్ రిలీఫ్ పేరుతో విధిస్తున్న అప్రకటిత కోతలతో ప్రజలు గురువారం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టీటీడీ వెబ్‌సైట్ మారింది చూశారా?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి చెందిన వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను https://ttdevasthanams.ap.gov.in గా మార్చుతున్నట్లు ప్రకటించింది. ఒకే సంస్థ, ఒకే వెబ్‌సైట్, ఒకే మొబైల్ యాప్ అన్న నినాదం మేరకు వెబ్సైట్ పేరును https://ttdevasthanams.ap.gov.in గా మార్చినట్లు ఐటీ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి సోమవారం తెలిపారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. టీటీడీ ఐటీ విభాగం ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సాఫ్ట్వేర్ అప్లికేషన్లను రూపొందించడం ద్వారా శ్రీవారి భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలు, గదులు, లడ్డూ ప్రసాదం తదితర సేవలను వేగంగా, పారదర్శకంగా అందిస్తోందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అధికారులపై చర్యలు
కాంగ్రెస్ వార్ రూమ్ వాలంటీర్ల నిర్బంధంపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది. వాలంటీర్ల నిర్బంధంపై విచారణకు ఆదేశించింది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. వారిని అక్రమంగా నిర్బంధించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రామోజీరావుపై చీటింగ్ కేసు
మార్గదర్శి వ్యవహారంలో మరో కేసు నమోదైంది. ఈసారి సంస్థ మాజీ షేర్ హోల్డర్ ఫిర్యాదు చేశారు. మార్గదర్శి వ్యవస్థాపకులలో ఒకరైన జి. జగన్నాథ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్ 42O, 467, 120-8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ ను చేర్చారు. మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మద్యం వ్యాపారులకు షాక్
ఎన్నికలు అంటే ముందుగా ఎక్కువగా పార్టీలు ఖర్చు పెట్టేది మద్యం మీదనే. అందుకే మద్యం వ్యాపారులు ఎన్నికల పండుగ చేసుకుంటారు. తెలంగాణలోనూ అంతే. అయితే మద్యం వ్యాపారులకు ఊహించని కష్టం వచ్చింది. అమ్మకాలు పెరిగాయి కానీ.. వచ్చిన డబ్బును బ్యాంకులో జమ చేసుకోలేకపోతున్నారు. ముందుగానే పోలీసులు పట్టుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉండటమే దీనికి కారణం. పట్టుబడుతున్న డబ్బులో మద్యం వ్యాపారులదే ఎక్కువ ఉందని వారంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పిండాన్ని చిదిమేయలేమన్న సుప్రీంకోర్టు
గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొద్ది రోజల కిత్రం ఓ మహిళ తన 26 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇప్పటికే పలు మార్లు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే గర్భం వయసు 24 వారాలు దాటాయని.. ఇప్పుడు ఆ గుండె చప్పుడును ఆపలేమని స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యుల నివేదిక ఆధారంగా గర్భ విచ్ఛిత్తికి అంగీకరించడం లేదని పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హ్యాట్రిక్ కోసం ఎదురు చూపు
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికా మరో విజయంపై కన్నేసింది. ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి సెమీస్ దిశగా మరో అడుగు ముందుకేయాలని భావిస్తోంది. భీకర ఫామ్‌లో ఉన్న బవుమా సేనకు.. గట్టిపోటీ ఇవ్వాలని నెదర్లాండ్స్ పట్టుదలగా ఉంది. కానీ డికాక్ వరుస సెంచరీలతో ఊపు మీదున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముగ్గురు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సెంచరీలు చేశారు. ఈ పరిస్థితుల్లో అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ప్రొటీస్‌ను నెదర్లాండ్స్ అడ్డుకోవడం అంత తేలికేమీ కాదు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు అఫ్ఘానిస్థాన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ అలాంటి ప్రదర్శనే చేసి సఫారీలకు షాక్ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. గతంలో బలహీనమైన జట్లతో ఓడిపోయి ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన చరిత్ర దక్షిణాఫ్రికాకు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను తాము తేలిగ్గా తీసుకోవడం లేదని ప్రొటీస్ జట్టు కెప్టెన్ బవుమా ఇప్పటికే వెల్లడించాడు. కాబట్టి దక్షిణాఫ్రికా భారీ విజయంపై కన్నేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ఎలా ఉంది?
హారర్ సినిమాలు తీయడం ఆర్ట్. ఇండియాలో చాలా తక్కువ మంది దర్శకులు అందులో పట్టు సాధించారు. ముఖ్యంగా తమిళంలో 'కాంచన' ఫ్రాంఛైజీతో రాఘవా లారెన్స్, తెలుగులో 'రాజుగారి గది' ఫ్రాంఛైజీతో ఓంకార్ (Omkar) విజయాలు సాధించారు. భయంతో కూడిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు. హారర్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ మీద విజయాలు అందుకున్న ఓంకార్... ఇప్పుడు 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ (Mansion 24 Web Series)తో ఓటీటీలో అడుగు పెట్టారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఎలా ఉంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఛాలెజింగ్ టాస్క్
ఏదైనా కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడం అంటే ఛాలెంజింగ్ విషయమే. అయితే.. ‘బిగ్ బాస్’ వంటి రియాలిటీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం మాత్రం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. అందులో ఉండే కంటెస్టెంట్లను జడ్జ్ చేయడం అంత ఈజీ కాదు. వారి తప్పొప్పులను బేరీజు వేసుకుంటూ.. సరైన నిర్ణయాన్ని వెల్లడించాలి.. హౌస్‌ను ఆర్డర్‌లో పెట్టేలా కంటెస్టెంట్లకు హితబోధ చేయాలి. అలాగే అందులో జరిగే చిన్న విషయాన్ని కూడా పరిశీలించాలి. ఎవరికీ సపోర్ట్ చేయకుండా.. న్యూట్రల్‌గా వ్యవహరించాలి. నాగార్జున అలా చేశారు కాబట్టే.. ఇన్నాళ్లు హోస్ట్‌గా రాణిస్తున్నారు. ప్రేక్షకులు కూడా నాగార్జునే ఈ షోకు సరైనవారనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి