Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు- విలవిల్లాడుతున్న ప్రజలు
AP Telangana Weather News:రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు సెగలు కక్కిస్తున్నాయి. ఉదయం 8 గంటలు నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Heat Waves In Telangana And AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు సెగలు కక్కిస్తున్నాయి. ఉదయం 8 గంటలు నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మే, జూన్ మొదటి వారాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ, ఏప్రిల్ తొలి వారంలోనే భానుడు తీవ్రరూపం దాల్చుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగలతో బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు సాహసించడం లేదు. తెలంగాణ, ఏపీలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 43.5 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అతి తక్కువగా వరంగల్ జిల్లాలో 40.6 డిగ్రీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి తెలంగాణలోని ఆరు జిల్లాల్లో మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మాత్రం దాదాపు అన్ని జిల్లాల్లోనూ భానుడి తీవ్రతతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పెరిగిన ఉష్ణోగ్రతలు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో గతేడాది ఏప్రిల్ రెండో తేదీన 41.6 డిగ్రీలు నమోదు కాగా, ఈ ఏడాది రెండు డిగ్రీలు ఎక్కువగా అంటే 43.6 డిగ్రీలుగా నమోదైంది. జగిత్యాల జిల్లాలో గతేడాది కంటే 3.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ అత్యధికంగా కుత్భుల్లాపూర్‌లో 42.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా 38.3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ ఏడాది 3.8 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఏపీలో భారీగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక చోట్ల 40 నుంచి 44 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతోపాటు అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలోని కనిగిరిలో 43.7 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే ఇది ఐదు డిగ్రీలు అధికం. అలాగే, కర్నూల్ జిల్లాలోని వగరూర్‌లో 43.5, వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 43.4 డిగ్రీలు, అనంతపురం జిల్లాలోని తెరన్నపల్లి, తిరుపతి జిల్లాలోని ఏ నెల్లూరు, నంద్యాల జిల్లాలోని అనుపూర్‌లో 43 డిగ్రీలు చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు మంగళవారం నమోదయ్యాయి.
పెరగనున్న ఎండ తీవ్రత
రానున్న నాలుగు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నాయి. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నెల ఏడో తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. వడగాడ్పులు పలు ప్రాంతాల్లో వీచే అవకాశముందని హెచ్చరించింది.
అత్యవసరమైతే తప్పా బయటకు వద్దు
ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలు నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే బయటకు రావద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచించింది. వృద్ధుల, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరింది. ప్రజలు అనారోగ్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిట్రేడ్ కంటే ఎక్కువగా నమోదు కావడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తల తిప్పడం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.