Weather Update: పొంచి ఉన్న వానగండం- ములుగులో భారీగా నేలకూలిన వృక్షాలు- సోమవారం వరకు స్కూల్స్‌కి సెలవులు
Andhra Pradesh Weather: వర్షాలు వరదలతో వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలను మరో వాయుగుండం వణికిస్తోంది. ప్రస్తుతానికి అల్పపీడనంగా ఉన్నప్పటికీ బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది.
Telangana Weather: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే వరదల దెబ్బ నుంచి కోలుకోని జిల్లాల్లో కూడా వర్షాలు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే మూడు రోజులుగా కురిసిన వర్షాలకు, పొంగిన వరదలకు ప్రజలు చతికిల పడిపోయారు. ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి అంతస్తు వరకు నీళ్లు రావడంతో చిన్నపెద్ద అనే తేడా లేకుండా అంతా రోడ్డున పడ్డారు. ఇళ్లలో బురదల మేటలు వేసి ఉంది. దాన్ని ఎలా తొలగించాలని ఆలోచనలో ఉన్న ప్రజలకు ఇప్పుడు పడుతున్న వర్షాలు షాక్‌కి గురి చేస్తున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం
సెప్టెంబర్ 5న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఇప్పుడు వాతావరణం అందుకు అనుగుణంగానే మారుతోంది. విజయవాడ, ఖమ్మం సహా చాలా జిల్లాల్లో వర్షావరణం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణాధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాలకు ఛాన్స్
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండగా మారుతుందని... దీని ప్రభావం కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంటున్నారు.
తెలంగాణలో గాలి వాన
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పినట్టుగా... మధ్య విదర్భ, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రామగుండం, కళింగపట్నం, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ఈ జిల్లాల్లో వర్షాలు
ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగుజిల్లాల్లో గాలివాన ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో చెదురుమదురు వాన పడే ఛాన్స్ ఉంది.
Also Read: వరద నియంత్రణలో ఏపీ సర్కార్ ఫెయిల్- రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ములుగులో బీభత్సం
వాతావరణ శాఖ చెప్పినట్టుగానే ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ములుగు జిల్లా అడవుల్లో వర్షానికి తోడు సుడిగాలి మెలితిప్పేసింది. ఈ సుడిగాలి దెబ్బకు మేడారం - తాడ్వాయి మధ్య రిజర్వ్ ఫారెస్టులో 3 కిలోమీటర్ల మేర లక్ష చెట్లు నేలకూలాయి.
రికార్డుస్థాయి వర్షాలు
తెలంగాణలో గత 24 గంటల్లో కురిసి వర్షపాతం పరిశీలిస్తే... హుస్నాబాద్‌లో 17 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. నిజామాబాద్‌లోని నందిపేట, మక్లూరు, భద్రాద్రి కొత్తకూడెంలోని ఎల్లందు 13 సెంటీమీటర్ల వర్షపాతం పడింది.
ఖమ్మంలో సోమవారం వరకు స్కూల్స్‌కి సెలవులు
వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖాధికారుల హెచ్చరికలతో ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈనెల 6 వరకు సెలవులు ప్రకటించారు. ఈ మరేకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలు ఇచ్చారు. సోమవారం నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు.