సూపర్ స్టార్ రజనీకాంత్‌కు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫోన్- ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. వైసీపీ చేస్తున్న విమర్శలపై మాట్లాడారు. బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ పర్యటన రాజకీయంగా పెనుదుమారాన్నే రేపింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన చేసిన కామెంట్స్‌పై అధికార వైసీపీ ఫైర్ అవుతోంది. కొందరు నేతలు పరుషపదజాలంతో దూషించారు. ఈ విమర్శళ టైంలో రజనీకాంత్‌కు టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు.
నాలుగు మంచిమాటలు చెప్పినా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని రజనీతో చంద్రబాబు అన్నట్టు సమాచారం. ఇలా మాటలు దాడి చేయడం చాలా బాధాకరమని వారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి చింతిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.
ఇలాంటివి తాను పట్టించుకోవడం లేదని చంద్రబాబుకు రాజనీకాంత్ బదులిచ్చారట. ఉన్న విషయాలే చెప్పానని... ఎవరు ఎలా మాట్లాడుకున్నా తాను పట్టించుకోబోనని చెప్పినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని... మాట మారేది లేదన్నారని చెప్పుకుంటున్నారు.
Strongly condemn the demeaning & derogatory comments made by YSRCP leaders against the legendary superstar @rajinikanth, who is an epitome of honesty, integrity, and humility. Rajinikanth has a heart of gold and is much loved by all in India and across the globe. The organised… pic.twitter.com/xnxLIuhltF
— N Chandrababu Naidu (@ncbn) May 1, 2023
ఏప్రిల్ 28న విజయవాడ సమీపంలోని తాడిగడపలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. దీనికి సూపర్ స్టార్ రజనీకాంత్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదే టైంలో చంద్రబాబుతో ఉన్న సన్నిహిత్యాన్ని కూడా తెలియజేశారు. ఆయన విజన్ గొప్పదని ఏపీ ప్రజలు దాన్ని గుర్తించాలని సూచించారు.
రజనీకాంత్ చేసిన కామెంట్స్‌పై అధికార వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. మంత్రి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు తదితరులు కోలీవుడ్ సూపర్ స్టార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదని, ఆయన తమిళనాడులో హీరో కావొచ్చు గానీ ఇక్కడ కాదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధంగా కొడాలి నాని సహా పలువురు నేతలు దూషించడంతో రజనీకాంత్ అభిమానులు మండి పడుతున్నారు. వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్ర దేశంలో మా సూపర్ స్టార్, మా చిరంజీవికి విలువ ఉందని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడితే ఆలోచించాలని, తమిళనాట రజనీకాంత్ సూపర్ స్టార్ అని, ఆయన అక్కడ మాట్లాడితే విలువ ఉంటుందని ఆయన సెటైర్లు వేశారు. వైసీపీని విమర్శించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, తమకు చిరంజీవి మాటలే లెక్క అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన్ని యుగపురుషుడని కొనియాడిన @rajinikanth అదే ఎన్టీఆర్‌కు @ncbn వెన్నుపోటు పొడవడంలో ఎందుకు సహకరించాడు? అప్పుడు అంతా చేసి ఇప్పుడు పొగడడం చూస్తుంటే ఈయన తెరమీదే కాదు తెర వెనుక కూడా గొప్పనటుడు అనిపిస్తోంది. https://t.co/o1bT29w18x pic.twitter.com/kJjHSo0mrm
— Roja Selvamani (@RojaSelvamaniRK) May 1, 2023
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆ పార్టీ సమర్థించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ అంశంపై స్పందించింది. 5 కోట్ల మంది ప్రజలు తీర్పునిస్తే 23 సీట్లకు పరిమితమైన పార్టీ టీడీపీ అని.. మూడు సార్లు దారుణంగా ఓడిపోయారని వైసీపీ విమర్శించారు. సొంత ఊరిలో ఓడిపోయి కుప్పానికి పరిగెత్తిన ఫెయిల్యూర్ పాలిటీషియన్.. ఏపీని నాశనం చేసిన ఓ దుర్మార్గుడిని పొగిడితే ప్రశ్నించడం ఏ మాత్రం తప్పు కాదని స్పష్టం చేసింది.