Rayachoti Terror Update: రాయచోటిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని పట్టుకోకపోతే విధ్వంసమే-భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం !
Rayachoti: రాయచోటిలో తమిళనాడు ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వారి ఇళ్లల్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వందల మందికి శిక్షణ ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.

Rayachoti terrorists explosives: అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడిన టెర్రరిస్టుల వ్యవహారం కలకలం రేపుతోంది. తమిళనాడు యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు వ్యక్తులు గత మూడు దశాబ్దాలుగా రాయచోటిలో రహస్య జీవితం గడుపుతూ సాధారణ వ్యాపారులుగా జీవిస్తున్నారు. అబూబకర్ సిద్దీకి ,మొహమ్మద్ అలీ తమిళనాడులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు. ఈ ఇద్దరు సోదరులు కేరళలోని మేళపలయం నివాసులు. వారు 1995 నుండి అనేక ఉగ్రవాద కేసుల్లో నిందితులుగా ఉన్నారు . గత 30 సంవత్సరాలుగా రాయచోటిలో రహస్యంగా జీవిస్తున్నారు.
రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో నివసిస్తూ చీరల వ్యాపారంతో పాటు చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నారు. అబూబకర్‌ను స్థానికులు "కేరళ కుట్టి"గా పిలిచేవారు. వీరిపై 1995 పార్సిల్ బాంబు కేసు, 1999లో తమిళనాడు మరియు కేరళలో జరిగిన సీరియల్ బాంబు దాడులు, 2011 మదురైలో బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీ రథయాత్రపై బాంబు దాడి ప్రణాళిక, 2013 మల్లేశ్వరం బీజేపీ కార్యాలయ బాంబు దాడి, 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య కేసులు ఉన్నాయి.
అబూబకర్ , మొహమ్మద్ అలీ మదనపల్లె డివిజన్‌కు చెందిన స్థానిక మహిళలను వివాహం చేసుకున్నారు. వారు రాయచోటిలో అద్దె ఇళ్లలో నివసించేవారు. తమ గురించి ఎక్కువగా బయటకు తెలియకుండా జాగ్రత్తపడేవారు. తమిళనాడు ఏటీఎస్ వారి భార్యలను అరెస్టు చేశారు. వారి ఇళ్లల్లో జరిగిన సోదాల్లో భారీగా పేలుడు పదార్థాలు తయారు చేసే వస్తువులు పట్టుబడ్డాయి. బకెట్ బాంబులు, సూట్‌కేస్ బాంబులు తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు లభించాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, డాక్యుమెంట్లు కూడా దొరికాయి.
రాయచోటి నుంచి వారు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలకు ఈ బాంబులు దొరకడం సాక్ష్యంగా మారాయి. అదే సమయంలో స్థానిక యువతకు రహస్యంగా శిక్షణ ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో.. ఉగ్రవాదులతో లింకులపై తనిఖీలు
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 3, 2025
సంయుక్తంగా సోదాలు నిర్వహించిన.. ఏపీ, తమిళనాడు పోలీసులు
రాయచోటి అర్బన్ ఏరియాలో విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారులు
ఉగ్రవాదులు నిర్వహించిన గోదాముల్లో పేలుడు పదార్థాల ముడి సరుకు ఆనవాళ్లు
టెర్రరిస్ట్ అబూబకర్ సిద్ధికి, యూనస్… pic.twitter.com/EqSN8tmHT2
ఈ ఇద్దరి గురించి సమాచారం వచ్చిన తర్వాత ఐబీ అధికారులు రాయచోటిలో రహస్యంగా కొన్ని నెలల పాటు నిందితుల కదలికలను పరిశీలించారు. వారు స్థానిక వీధి వ్యాపారులుగా మారువేషంలో ఉంటూ నిఘా పెట్టారు. రెండు నెలల తీవ్ర నిఘా తర్వాత, తమిళనాడు ATS,అన్నమయ్య జిల్లా పోలీసుల సహకారంతో జులై 2, 2025 మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌లు రాయచోటిలో భయాందోళనలను రేకెత్తించాయి. తమతో కలిసిపోయిన వీరు టెర్రరిస్టులా అని ఆశ్చర్యపోతున్నారు.





















