రాజస్థాన్ కోటాలో మరో అలజడి, వారం రోజుల్లో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
Kota Students Missing: రాజస్థాన్‌లోని కోటాలో వారం రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.
Kota Students Goes Missing: రాజస్థాన్‌లోని కోటా ప్రాంతం రోజూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తోంది. వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సమస్యతోనే సతమతం అవుతుంటే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. వారం రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల్నీ ఇది టెన్షన్ పెడుతోంది. 18 ఏళ్ల యువరాజ్ NEET ఎగ్జామ్ కోసం కోటాలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ప్రిపేర్ అవుతున్నాడు. ఫిబ్రవరి 17వ తేదీన కోటాలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో ఉన్న తన హాస్టల్ నుంచి బయటకు వచ్చాడు. ఉదయం 7 గంటలకు కోచింగ్ సెంటర్‌కి వెళ్లాల్సి ఉంది. కానీ...అప్పటి నుంచి ఇప్పటి వరకూ కనబడకుండా పోయాడు. మొబైల్‌ని హాస్టల్‌లోనే వదిలేశాడు. ఎక్కడ ఉన్నాడన్నది తెలియడం లేదు. అంతకు ముందు వారం రోజుల క్రితం రచిత్ సోంధ్యా అనే మరో విద్యార్థి ఇలాకే అదృశ్యమయ్యాడు. JEE ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న రచిత్...హాస్టల్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మళ్లీ తిరిగిరాలేదు. కోటాలోని ఓ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లినట్టు అక్కడి CC కెమెరాల్లో రికార్డ్ అయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన రచిత్...ఎప్పటిలాగే హాస్టల్ నుంచి బయటకు వచ్చినా...కోచింగ్ సెంటర్‌కి వెళ్లలేదు. క్యాబ్‌లో ఓ అటవీ ప్రాంతం వరకూ వెళ్లి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ యువకుడి బ్యాగ్, మొబైల్, రూమ్ తాళాలు అన్నీ ఓ ఆలయం వద్ద కనుగొన్నారు. అప్పటి నుంచి ఆచూకీ కోసం వెతుకుతున్నప్పటికీ ఇంకా ఎక్కడ ఉన్నాడన్నది తెలియలేదు.