Srisailam Maha Shivaratri 2026: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు
Maha Shivaratri 2026: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. నాలుగు రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు చేయడంతో పాటు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతోంది.

శ్రీశైలం, నంద్యాల: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం భక్తులకు శుభవార్త చెప్పింది. నేటి (ఈ నెల 13) నుంచి 16 వరకు శ్రీశైలం దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద వాహనాలకు ఛార్జీల మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రకటించారు.
శ్రీశైలంలోని దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఎస్పీ సునీల్ షొరాణ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నాలుగు రోజుల పాటు (ఈ 13 నుంచి 16 వరకు) రాత్రివేళల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 2,59,050 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, మహాశివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు చలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. నంద్యాల- శ్రీశైలం మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు నడుస్తోందని, ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి 1,800, తెలంగాణ నుంచి 1,000, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో కలిపి మొత్తం 3 వేల బస్సులను అందుబాటులో ఉంచినట్లు నంద్యాల కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న భద్రతా ఏర్పాట్లు, నిబంధనలకు భక్తులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆమె కోరారు.
కనీస సౌకర్యాలు లేవని భక్తుల ఆవేదన
మరోవైపు అటవీ, దేవాదాయ శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపం పాదయాత్ర చేసే భక్తులకు ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శలు వస్తున్నాయి. శ్రీశైలానికి నడక దారిలో వచ్చే భక్తులు నల్లమల అడవిలో దాదాపు 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడానికి అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అటవీశాఖే ఈ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ వారు చేయడం లేదని, జిల్లా అధికారులు ముందుకొచ్చినా అనుమతులు నిరాకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. గతంలో ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ ఏటా రూ.5 లక్షలు ఇస్తుండగా, ప్రస్తుతం అటవీశాఖ అధికారులు రూ.60 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల మధ్య నెలకొన్న ఈ వివాదం మహాశివరాత్రి, శ్రీశైలం బ్రహ్మోత్సవం భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది.
Before You Go
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్లో మొదలైన మంచు పండగ.. గుల్మార్గ్ అఫర్వాత్ పీక్ను కప్పేసిన తెల్లటి హిమపాతం
ట్రెండింగ్ వార్తలు























