(Source: ECI/ABP News/ABP Majha)
Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్‌కి సుప్రీంకోర్టు అక్షింతలు, ఆయన తీరేమీ బాలేదంటూ ఆగ్రహం
Supreme Court: తమిళనాడు గవర్నర్ RN రవిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Tamil Nadu Governor RN Ravi: తమిళనాడు గవర్నర్ RN రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల నేరారోపణలు ఎదుర్కొని మంత్రి పదవి నుంచి తప్పుకున్న DMK నేతని మళ్లీ మంత్రిగా నియమించడంలో జాప్యం జరగడంపై మండి పడింది. గవర్నరే రాజ్యాంగాన్ని అనుసరించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. డీఎమ్‌కే నేత కే పొన్ముడి ని (Ponmudi) మళ్లీ మంత్రిగా నియమించేందుకు ఒకరోజు గడువునిచ్చింది. ఈ గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పొన్ముడి నియామకాన్ని RN రవి పట్టించుకోకపోవడంపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని మండి పడింది. గవర్నర్ తీరుని నిరసిస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆస్తుల కేసులో పొన్ముడి MLA సభ్యత్వంపై వేటు పడింది. మద్రాస్ హైకోర్టు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. అంతే కాదు. రెండేళ్ల జైలుశిక్ష కూడా విధించింది. అయితే...ఆ తరవాత ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆ తీర్పుని నిలిపివేసింది. ఈ మేరకు ఆయనను మళ్లీ మంత్రిగా నియమించాలని గవర్నర్‌ని విజ్ఞప్తి చేసింది. అయితే..ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
"మీరు మేమిచ్చిన గడువులోగా స్పందించకపోతే రాజ్యాంగబద్ధంగా ఓ గవర్నర్ చేయాల్సిన విధులేంటో మేం గుర్తు చేయాల్సి ఉంటుంది. తమిళనాడు గవర్నర్ విషయంలో మేం చాలా అసహనంగా ఉన్నాం. ఆయన వైఖరి సరిగా లేదు. ఇలా జాప్యం చేయాల్సిన అవసరం ఆయనకు ఏముంది. మేం పూర్తిస్థాయిలో ఈ విషయంపై దృష్టి పెట్టాం. ఏం చేయాలన్నది త్వరలోనే నిర్ణయిస్తాం"
- చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్