Dattatreya Hosabale: భారతీయులందరూ పుట్టుకతో హిందువులే, బీఫ్ తినే వాళ్లనూ మతంలోకి ఆహ్వానిద్దాం - RSS లీడర్
Dattatreya Hosabale: ఆర్ఎస్‌ఎస్ నేత దత్తాత్రేయ హోసబేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Dattatreya Hosabale:
పూర్వీకులంతా హిందువులే : దత్తాత్రేయ హోసబేల్
రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంఘ్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్‌ఎస్ నేత దత్తాత్రేయ హోసబేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గొడ్డుమాంసం తినే వాళ్లు కూడా మళ్లీ హిందూ మతంలోకి రావచ్చని వెల్లడించారు. అంతే కాదు. భారత్‌లో నివసించే వాళ్లందరూ పుట్టుకతోనే "హిందువులు" అని తేల్చి చెప్పారు. గొడ్డు మాంసం తినే వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, కానీ...అలాంటి వాళ్లు హిందూ మతంలోకి వస్తామంటే మాత్రం ఆహ్వానం పలకాలని వెల్లడించారు. అలాంటి వాళ్లనూ హిందూ మతంలోకి సాదరంగా స్వాగతించాలని అన్నారు.
"ఎవరు ఏ వర్గానికి చెందిన వారైనా సరే. వాళ్ల పూర్వీకులు హిందువులే. అందుకే వీళ్లు కూడా హిందువులే అవుతారు. వాళ్లు ఏ దేవుడిని పూజిస్తున్నారు..? ఏ ఆచారాలు పాటిస్తున్నారు..? అనేది మాకు అనవసరం. హిందువులు ఎప్పటికీ హిందువులే"
- దత్తాత్రేయ హోసబేల్, ఆర్‌ఎస్‌ఎస్ లీడర్
దేశవ్యాప్తంగా 600కి పైగా గిరిజన తెగలున్నాయన్న దత్తాత్రేయ...వాళ్లు కూడా హిందువులే అని తేల్చి చెప్పారు.
"గిరిజన తెగలు మేము హిందువులం కాదు అని పదేపదే చెబుతుంటాయి. జాతి వ్యతిరేక శక్తులే వాళ్లను ఇలా మభ్య పెడుతున్నాయి. వసుధైక కుటుంబం అనే సూత్రం మనది. ఎవరైనా హిందూ మతంలోకి మారాలనుకుంటే తలుపులు మూసేసి నియంత్రించడం సరికాదు. గొడ్డు మాంసం తినే వాళ్లనైనా సరే రానివ్వాలి. భారత్ ఎప్పటికీ హిందూ దేశమే. ఈ దేశాన్ని నిర్మించింది హిందువులే. ఈ నిజాన్ని అందరూ అంగీకరించాలి"
- దత్తాత్రేయ హోసబేల్, ఆర్‌ఎస్‌ఎస్ లీడర్
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని ఆయన అన్నారు.
" ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందూత్వ సిద్ధాంతం. వేల సంవత్సరాలుగా భారత్ ఇదే భిన్నత్వాన్ని చాటుతోంది. 40 వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన అందరి డీఎన్‌ఏ ఒక్కటే. ప్రతిఒక్కరూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తప్పక పాటించాలని పూర్వీకులు మనకు నేర్పించారు. భారత్‌ను తమ మాతృభూమిగా భావించి, ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతితో కలిసి జీవించాలనుకునేవారి కులం ఏదైనా, ఏ మతాన్ని అనుసరిస్తున్నా, వారు మాట్లాడే భాష వేరైనా, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాల్లో వ్యత్యాసం ఉన్నా వారంతా హిందువులే. ఇదే విషయాన్ని 1925 నుంచి ఆర్‌ఎస్‌ఎస్ చెబుతోంది."
దేశంలో ఇతర మతాలు, విశ్వాసాలు, సంప్రదాయాలను అందరూ గౌరవించాలని భగవత్ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిందని గుర్తుచేశారు.
" ఇతరుల విశ్వసాలు, సంప్రదాయాలను మనమంతా గౌరవించాలి. సొంత లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఇతరుల సంపదను దోచుకోవద్దు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడింది. సంస్కృతే అందర్ని ఒక్కటిగా చేస్తుందనేందుకు ఇదే నిదర్శనం. "- మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్