Arvind Kejriwal: అతిషి జెండా ఎగురవేస్తారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు కేజ్రీవాల్ లేఖ, జైలు అధికారుల అసహనం
Independence Day2024: తాను జైల్లో ఉన్నందున ఆగస్ట్ 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తన స్థానంలో మంత్రి అతిషి జెండా ఎగురవేస్తారని పేర్కొంటూ ఢిల్లీ ఎల్జీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ (Delhi excise cpolicy) కేసులో ఆరోపణలపై తీహార్ జైలుకు వెళ్లినప్పటి నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. జైలులోనే తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ఆరోపణలను జైలు అధికారులు కొట్టిపారేశారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చర్యను జైలు అధికారుల తప్పుపట్టారు. జైలు నిబంధనలకు విరుద్ధంగా లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాకు ఆగస్టు 6న కేజ్రీవాల్ లేఖ రాసినట్లు వారు పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ (Independence Day) (ఆగస్టు 15) వేడుకలో త్రివర్ణ పతాకాన్ని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి ఎగురవేస్తారంటూ ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ రాయడం ఢిల్లీ జైలు నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఢిల్లీ సెంట్రల్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కు జైలు సూపరింటెండెంట్ లేఖ రాశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు మీరు రాసిన లేఖ జైలు నిబంధనల ప్రకారం కేజ్రీవాల్‌కు మంజూరైన 'అధికార హక్కుల దుర్వినియోగం' అని తీహార్ అధికారి కేజ్రీవాల్‌కు తెలిపారు.
అధికారాలు తగ్గిస్తాం
తీహార్ జైలు నం. 2 సూపరింటెండెంట్ ఢిల్లీ ప్రిజన్ రూల్స్-2018ను చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో అలాంటి నిబంధనలకు విరుద్ధంగా అనుచిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. లేకపోతే అతని అధికారాలను కుదిస్తామని పేర్కొన్నారు. గత వారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ తన స్థానంలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆతిషి జాతీయ జెండాను ఎగురవేస్తారని చెప్పారు.ఈ లేఖ లెఫ్టినెంట్ గవర్నర్‌కు చేరుకోలేదు. కానీ అందులోని విషయాలు వెలుగు చూశాయి. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. లేఖలోని విషయాలను ఎలా మీడియాకు లీక్ అయ్యాయో తెలియడం లేదని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది జైలు నిబంధనల కింద ఆయనకు కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సీఎంకు సూచించారు. కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో ఈ లేఖను జైలు వెలుపలకు పంపడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అందుకని ఆగస్ట్ 6న రాసిన లెటర్ ఎల్జీకి పంపలేదు. కానీ ఈ లెటర్ ను ఫైల్ చేశారు.
సిసోడియా చేస్తారని ప్రచారం
మద్యం కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసులో కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారు. వాస్తవానికి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆగస్టు 15న ఆయనే జెండాను ఎగురవేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కూడా అతిషి పేరును ప్రకటించారు. మంత్రి గోపాల్ రాయ్ తో భేటీ తర్వాత ఆగస్ట్ 15న అతిషినే జాతీయ జెండా ఎగురవేస్తారని తేలిపోయింది.
మనీష్ సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్
సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ షరతులతో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం ఉదయం ఈడీ, సీబీఐ కార్యాలయాలకు వెళ్లి తన హాజరును నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య రెండు దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు వెళ్లి తమ విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. మనీష్ సిసోడియా మొదట సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అతను తన దర్యాప్తు అధికారిని కలుసుకుని హాజరు రిజిస్టర్‌పై సంతకం చేశాడు. అనంతరం ఈడీ కార్యాలయానికి వెళ్లి అక్కడ కూడా విచారణ అధికారి ఎదుట హాజరు నమోదు చేసుకున్నారు.
ఆప్ పై విరుచుకుపడ్డ బీజేపీ
అతిషి జాతీయ జెండాను ఎగురవేస్తున్నందుకు సీఎం కేజ్రీవాల్‌ను రాజీనామా చేయమని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా డిమాండ్ చేశారు. జెండా ఎగురవేతకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాసిన లేఖ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), దాని నాయకులు అరాచకవాదులు అని రుజువు చేసిందన్నారు. జాతీయ జెండా ప్రోటోకాల్ ప్రకారం, రాష్ట్రాలలో జెండాను ఎగురవేసేందుకు ముఖ్యమంత్రికి మాత్రమే అధికారం ఉందని సచ్‌దేవా ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి జెండాను ఎగురవేయలేకపోతే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంప్రదాయబద్ధంగా విధిని నిర్వహిస్తారని సచ్‌దేవా తెలిపారు. 1991 నుంచి 1993 వరకు, 2014లో ఢిల్లీలో ముఖ్యమంత్రి లేని సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ జెండాను ఎగురవేశారని పీటీఐ పేర్కొంది.