Ramesh Jarkiholi CD Case: కర్ణాటకను కుదిపేసిన సీడీ కేసులో మాజీ మంత్రికి క్లీన్ చిట్
కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్ఖిహెళికి సీడీ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం.
కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సీడీ కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి రమేశ్ జర్ఖిహోళికి క్లీన్ చిట్ లభించింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. జర్ఖిహోళి అందులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. కేసును మూసివేసేందుకు కోర్టుకు నివేదికను సమర్పించింది దర్యాప్తు బృందం.
ఇదే కేసు..
ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు గతేడాది మార్చి 2న రమేశ్ జర్కిహోళిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ విషయంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఈ ఆరోపణలను తొలుత ఖండించిన జర్ఖిహోళి.. తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
అనంతరం, జర్కిహోళిపై కేసును ఉపసంహరించుకోవాలని సామాజిక కార్యకర్త నిర్ణయించుకున్నారు. కానీ ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
ఖండించిన జర్ఖిహోళి
మరోవైపు తన నుంచి డబ్బులు లాగి, అప్రతిష్ఠ తీసుకొచ్చేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆ తర్వాత జర్ఖిహోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అయితే ఈ కేసులో చాలా మంది ఉన్నారని.. నకిలీ సీడీలు సృష్టించి, ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారని ఆరోపించారు. తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు సీడీల తయారీలో నిమగ్నమయ్యారన్నారు. ఈ మేరకు అప్పట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు.
రక్షణ కోరిన మహిళ..
రమేశ్ జర్కిహోళితో కలిసి ఓ అసభ్యకరమైన వీడియోలో ఉన్నట్లుగా భావిస్తున్న మహిళ.. తనకు రక్షణ కావాలని సామాజిక మాధ్యమాల వేదికగా ఆనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. భద్రత కల్పించాలన్నారు. ఆ దృశ్యాలు బయటపడటం వల్ల తన గౌరవానికి భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో విడుదల చేశారు.
Also Read: Yogi Adityanath Nomination: నామినేషన్ దాఖలు చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
Also Read: Women Reservation: ఆ మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు: రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు