Women Reservation: ఆ మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు: రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు
రిజర్వేషన్ కేటాయింపుపై రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుని రాజస్థాన్ వచ్చే ఇతర రాష్ట్రాల మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండదని తీర్పునిచ్చింది.
ప్రభుత్వ ఉద్యాగాల్లో రిజర్వేషన్ కోటాపై రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. పెళ్లి చేసుకున్న తర్వాత రాజస్థాన్ వచ్చే ఇతర రాష్ట్రాల మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ కింద రిజర్వేషన్ ఉండదని తేల్చిచెప్పింది. అయితే ఆయా కోటాల ఆధారంగా పొందే ఇతర ఫలాలు అందుతాయని పేర్కొంది.
ఇదే కేసు..
హనుమాన్‌గఢ్ నోహార్‌కు చెందిన సునీత రాణి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సునీత అనే మహిళ పంజాబ్‌లో జన్మించింది. ఆమె రేగార్ వర్గానికి చెందినది. ఈ వర్గం ఎస్సీ కేటగిరీలోకి వస్తుంది. ఆమె రాజస్థాన్‌లో పెళ్లి చేసుకుంది. దీంతో రాజస్థాన్ నోహార్ తహసీల్దార్‌కు ఎస్సీ సర్టిఫికెట్ కోసం ఆమె అభ్యర్థన చేసుకుంది. కానీ ఈ అభ్యర్థనను తహసీల్దార్ కార్యాలయం తిరస్కరించింది. ఆమె రాజస్థాన్ వాసి కాకపోవడం వల్లే అప్లికేషన్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది. దీంతో ఆమె ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసింది.
విచారణలో..
ఈ కేసును విచారించిన జస్టిస్ దినేశ్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన 2018, 2020లో ఇదే తరహా కేసులను విచారించారు. ఇలా పెళ్లి తర్వాత రాజస్థాన్ వచ్చి నివాసముండే మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించబోమని తెలిపారు. అయితే కుల ధ్రువీకరణ పత్రం పొందచ్చన్నారు. ఉద్యోగం మినహా మిగిలిన అన్నింట్లో కోటా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
Also Read: Asaduddin Owaisi Attack: ఓవైసీకి Z కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్ర ప్రభుత్వం
Also Read: Yogi Adityanath Nomination: నామినేషన్ దాఖలు చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్