Yogi Adityanath Nomination: నామినేషన్ దాఖలు చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్.
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పుర్లో నామినేషన్ దాఖలు చేశారు. యోగితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. యోగి నామినేషన్ నేపథ్యంలో గోరఖ్‌పుర్ మొత్తం కాషాయ జెండాలే దర్శనమిచ్చాయి.
ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్.. యూపీ శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. ఆయన తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఆయన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే మెయిన్‌పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గం నుంచి నామపత్రం దాఖలు చేశారు.
7 దశల్లో ఎన్నికలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్, గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది.
మణిపుర్‌లో రెండు ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపుర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు.
యోగిపై ఫిర్యాదు..
కేంద్ర ఎన్నికల సంఘానికి సమాజ్‌వాదీ పార్టీ లేఖ రాసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో మాట్లాడుతోన్న భాషపై ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా సీఎం మాట్లాడేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది.
" యూపీ ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడే భాష రెచ్చగొట్టే విధంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అలాంటి భాషను వినియోగించడాన్ని ఏ మాత్రం సమర్థించలేం. బెదిరించే ధోరణిలో యోగి మాట్లాడుతున్నారు. ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛ, సమగ్రతలను.. ఇలాంటి ఉల్లంఘనలు ప్రభావితం చేస్తాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి ఉల్లంఘనలు సరికాదు. కనుక సీఎంపై తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. "