(Source: ECI/ABP News/ABP Majha)
తమిళనాడులో ఓ క్వారీలో భారీ పేలుడు, నలుగురు కార్మికులు మృతి
Quarry Blast: తమిళనాడులోని ఓ క్వారీలో పేలుడు సంభవించిన నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Quarry Blast: తమిళనాడులోని విరుదునగర్‌లోని ఓ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే...మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదముందని అంటున్నారు అధికారులు. పేలుడు ధాటి ఆ స్థాయిలో ఉందని వివరిస్తున్నారు. అక్కడి సీసీ కెమెరాలో ఈ పేలుడు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రాథమిక విచారణ ప్రకారం...క్వారీలోని స్టోరేజ్ రూమ్‌లో ఈ పేలుడు సంభవించింది. అందులో పేలుడు పదార్థాలున్నాయని తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ అక్కడి శిథిలాల్ని చాలా జాగ్రత్తగా తొలగిస్తోంది. ఇంకేమైనా పేలుడు పదార్థాలున్నాయేమో అని పరిశీలిస్తోంది. అయితే..చాలా రోజులుగా స్థానికులు ఈ క్వారీపై ఫిర్యాదులు చేస్తున్నారు. గాలి కలుషితం అవుతోందని, తమ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కాసేపటి ముందే తాత్కాలికంగా ఈ క్వారీని మూసేశారు. దీన్ని శాశ్వతంగా మూసేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.