PM Modi Message: హిందూయేతర వర్గాలపైనా దృష్టి సారించండి, నేతలకు ప్రధాని మోదీ సూచనలు
హిందూయేత వర్గాలకూ భాజపాను చేరువ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సీనియర్ నేతలకు సూచించారు.
అన్ని వర్గాలకూ చేరువ కావాలి: ప్రధాని మోదీ
అన్ని వర్గాల వారికీ భాజపాను చేరువ చేయాలని పార్టీ నేతలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటి వరకూ భాజపాకు దూరంగా ఉంటున్న ఓటు బ్యాంకునీ తమ వైపు తిప్పుకునేలా వ్యూహ రచన చేయాలని పిలుపునిచ్చారు. హిందూయేతర వర్గాల్లోని ప్రజలనూ ఆకట్టుకునేలా ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. హిందూయేతర వర్గాల్లోనూ వెనకబడిన వాళ్లుంటారని, కేవలం హిందువులకే పరిమితం కాకుండా ఇతర వర్గాల వారికీ చేరవవటం ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. యూపీలోని అజంగర్, రామ్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తరవాత మోదీ ఈ సూచనలు చేశారట. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎస్‌పీ ప్రాబల్యం ఎప్పటి నుంచో ఉంది. పైగా ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ. ఇలాంటి చోట కూడా భాజపా పట్టు సాధించటం పార్టీ వర్గాల్లో విశ్వాసం నింపింది. అందుకే...హిందూయేతర వర్గాలకూ ప్రాధాన్యతనిస్తామన్న బలమైన సంకేతాలు భాజపా ఇవ్వాల్సిన అవసరముందని ప్రధాని మోదీ భావిస్తున్నారు.
హిందూయేతర వర్గాలూ ముఖ్యమే..
యూపీ, బిహార్‌లోని పస్‌మంద ముస్లింలు సహా ఇతర వర్గాల ఓటు బ్యాంకుని ఆకర్షించటానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది భాజపా. పైగా ఇప్పుడు వచ్చిన ఫలితాలూ అందుకు బలమైన సంకేతాలే ఇస్తున్నాయి. రెండోసారి యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక యోగీ ఆదిత్యనాథ్ దనిష్ ఆజాద్‌ను ప్రాధాన్యతనిచ్చారు. మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆయనకే అందించారు. ఈయన పస్‌మంద కమ్యూనిటీకి చెందిన వాడే కావటం వల్ల ఈ విధంగా ఆ వర్గ మద్దతును కూడగట్టుకోగలిగింది భాజపా. ఎప్పటి నుంచో ఈ వర్గానికి చేరువ కావాలని చూస్తోంది కాషాయ పార్టీ. ఇన్నాళ్లకు అది నెరవేరింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ...పలు సూచనలు చేశారట ప్రధాని మోదీ. ఇప్పుడే కాదు. గతేడాది కూడా ప్రధాని, పార్టీ కార్యకర్తలకు ఇలాంటి సూచనలే చేశారు. కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీకి చేరువయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ అక్కడ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది భాజపా. ఈసారి కచ్చితంగా ఎంతో కొంత ఉనికి చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
భారత్ విశ్వగురుగా నిలబడాలి..
ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. ప్రపంచానికి భారత్ విశ్వగురుగా మారేందుకు కృషి చేయాలని, రాజకీయాల్లో వారసత్వానికి స్వస్తి పలకాలని తీర్మానం ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని పాస్ చేసారు అమిత్‌షా. ఆ తరవాత ప్రధాని మోదీని ఏమైనా సూచనలు చేయాలని కోరగా, ఆయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడారట. అలాగే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమర్థత, నేపథ్యం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని, ఆమె గెలుపునకు కృషి చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.
Also Read: Himachal Pradesh Bus accident: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 16 మంది మృతి!