Lok Sabha Candidates List: బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో 34 మంది కేంద్రమంత్రులు, హ్యాట్రిక్‌కి గురి పెట్టిన మోదీ
Lok Sabha Candidates List: బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో 34 మంది కేంద్రమంత్రుల పేర్లున్నాయి.
BJP Lok Sabha Candidates List: లోక్‌సభ ఎన్నికల కోసం రంగం సిద్ధం చేసుకున్న బీజేపీ 195 అభ్యర్థులతో కూడిన తొలిజాబితాని విడుదల చేసింది. మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ లోగా అభ్యర్థులందరి పేర్లు ప్రకటించనుంది బీజేపీ. ఈ తొలిజాబితాలో మొత్తం 34 మంది కేంద్రమంత్రులకు అవకాశమిచ్చింది హైకమాండ్. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రహోం మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా పలువురు కీలక మంత్రుల పేర్లున్నాయి.
జాబితాలోని కీలక నేతలు వీళ్లే..
ప్రధాని నరేంద్ర మోదీ: ఈ జాబితాలో తొలి పేరు ప్రధాని నరేంద్ర మోదీదే. ఎప్పటిలాగే వారణాసి నుంచి మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు మోదీ. ఇప్పటికే రెండు సార్లు ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. 2014లో ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసి మోదీ చేతిలో ఓడిపోయారు. ఆ తరవాత 2019లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అమిత్ షా: 2014 నుంచి బీజేపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడే పోటీ చేసి గెలిచిన ఆయన ఈ సారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేయనున్నారు.
స్మృతి ఇరానీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. 2019లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు.
జ్యోతిరాదిత్య సింధియా: మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజవర్గం నుంచి రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేయనున్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఇటీవల మరోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే...ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కి మాత్రం మళ్లీ సీఎం పదవిని ఇవ్వలేదు హైకమాండ్. ఆయనను పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో చూడాలనుకున్న అధిష్ఠానం ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో నిలబెడుతోంది. విదిశ నియోజవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
కిరణ్ రిజిజు: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్ట్ నుంచి పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. 2019లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు తీసుకున్నారు కిరణ్ రిజిజు.
హేమ మాలిని: బాలీవుడ్ సీనియర్ నటి హేమ మాలిని మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 2014,2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
వీళ్లతో పాటు భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, మన్‌సుఖ్ మాండవియ, వి మురళీధరన్, గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, శర్వానంద సోనోవాల్ పేర్లూ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 370 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
Also Read: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి పదవీ గండం, త్వరలోనే రాజీనామా చేస్తారా?