Patanjali Products: పతంజలి ఉత్పత్తుల విక్రయాలు బంద్, సంచలన నిర్ణయం తీసుకున్న సంస్థ
Patanjali Products Sale: పతంజలి సంస్థ సంచలన ప్రకటన చేసింది. దాదాపు 14 ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపి వేస్తున్నట్టు వెల్లడించింది. దేశంలోని అన్ని స్టోర్స్ నుంచి వీటిని ఉపసంహరించుకోనుంది.
Patanjali Stops Sale of 14 Products: ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారంటూ చాలా రోజులుగా పతంజలిపై ఓ కేసు విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. చాలా రోజుల పాటు పతంజలి ఈ ఆరోపణల్ని పట్టించుకోలేదు. దీనిపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణకు హాజరైన రామ్ దేవ్‌బాబా ఆ తరవాత కీలక ప్రకటన చేశారు. అన్ని న్యూస్ పేపర్లలో క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇచ్చారు. కొరోనిల్ కిట్‌తో కొవిడ్ పూర్తిగా నయమైపోతుందని ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేసినందుకు క్షమించాలని కోరింది. అప్పటి నుంచి ఈ కంపెనీ ఉత్పత్తులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల లైసెన్స్‌లు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే పతంజలి సంచలన ప్రకటన చేసింది. దాదాపు 14 ఉత్పత్తుల విక్రయాల్ని నిలిపి వేస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్‌లో వీటన్నింటి లైసెన్స్ రద్దైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది సంస్థ. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ లైసెన్స్‌లను రద్దు చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న 5,600 ఫ్రాంచైజ్‌లలోనూ ఈ 14 ఉత్పత్తుల అమ్మకాల్ని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టుకి పతంజలి సంస్థ వివరించింది. ఇందులో స్వాసరి గోల్డ్, స్వాసరి, ముక్తవటి ఎక్స్‌ట్రా పవర్, పతంజలి దృష్టి ఐ డ్రాప్స్ సహా మరి కొన్ని ఉత్పత్తుల విక్రయాలు ఆగిపోనున్నాయి. Indian Medical Association పిటిషన్‌తో సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది ఈ వ్యవహారం. ఈ మేరకు పతంజలి ఈ చర్యలు చేపట్టింది. జులై 30వ తేదీన మరోసారి కోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. ఇకపై ఆచితూచి ప్రకటనలు ఇవ్వాలని ఇప్పటికే తేల్చి చెప్పింది. I&B శాఖలో సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనల గురించి ఫిర్యాదు చేసేందుకు వీలుగా కొత్త పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్నీ సుప్రీంకోర్టు ఆదేశించింది.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ప్రకటనలపైనే ఈ వివాదం అంతా మొదలైంది. వీటిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఇలాంటి ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. వివరణ ఇవ్వాల్సిందేననని తేల్చి చెప్పింది. అయితే ఎన్ని సార్లు మందలించినా పతంజలి పట్టించుకోలేదు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆచార్య బాలకృష్ణతో పాటు రామ్‌దేవ్ బాబా స్పందించారు. కోర్టుని క్షమాపణలు కోరారు. పేపర్లలలో చిన్నపాటి వివరణ ఇస్తూ యాడ్‌లు ఇచ్చింది. అయితే..పతంజలి యాడ్స్ ఏ సైజ్‌లో అయితే ప్రింట్ చేస్తారో క్షమాపణల నోట్ కూడా అంతే సైజ్‌లో ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. ఈ ఆదేశాల మేరకు మళ్లీ వాటి సైజ్‌ని మార్చింది పతంజలి. పెద్ద సైజ్‌లో ప్రకటనలు చేసింది. ఇకపై ఇలాంటివి మళ్లీ జరగవు అని పేర్కొంది.
Also Read: Viral News: ఒక్కసారిగా విరిగిపడిన కొండ చరియలు, నేషనల్ హైవే ధ్వంసం - వీడియో వైరల్