(Source: ECI/ABP News/ABP Majha)
Parliament Monsoon Session: సస్పెండ్ అయిన ఎంపీల్లో దక్షిణాది వారే ఎక్కువ? తెరపైకి కొత్త వాదన
Parliament Monsoon Session: పార్లమెంట్‌లో సస్పెండ్ అయిన ఎంపీల్లో ఎక్కువ మంది సౌత్ నుంచే ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. కావాలనే ఇలా చేస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు.
Parliament Monsoon Session:
సౌత్ ఎంపీలే ఎక్కువ..!
జులై 18 వ తేదీన పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దాదాపు 27 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే వీరిలో ఎక్కువ మంది దక్షిణాదికి చెందిన వాళ్లే ఉన్నారన్న కొత్త వాదన తెరపైకి వస్తోంది. వీరిలో దాదాపు 7గురు బెంగాల్ నుంచి, 8 మంది తమిళనాడు నుంచి ఉన్నారు. కేరళ నుంచి ఐదుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ లెక్కల్ని కాస్త గమనిస్తే...కేరళ, తమిళనాడు, తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలని చూస్తోంది. అందుకే టార్గెట్ చేసి మరీ సస్పెండ్ చేశారన్న వాదన వినిపిస్తోంది. వీరిలో తెరాస, డీఎమ్‌కే, ఎల్‌డీఎఫ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలున్నారు. ఉత్తర భారత్ సహా, ఈశాన్య భారత్‌లో పాగా వేసిన భాజపా ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోయింది. బెంగాల్‌లో అయితే పెద్ద ఆపరేషన్‌నే చేపడుతోంది భాజపా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ టీఎమ్‌సీ బలంగా ఉండటం వల్ల వెనకబడిపోయింది కాషాయ పార్టీ. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా, ప్రధాని మోదీ కూడా బెంగాల్‌లో ప్రచారాల్లో పాల్గొన్నారు. అంతకు ముందుతో పోల్చి చూస్తే సీట్ల సంఖ్య కాస్త పెంచుకోగలిగినప్పటికీ విజయం సాధించాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది. తరవాత క్రమంగా కొందరు భాజపా ఎమ్మెల్యేలు..తృణమూల్‌కు వరుస కట్టారు.
అక్కడ ప్లాన్ బెడిసికొట్టింది...
ఇక తమిళనాడు భాజపాకు కొరకరాని కొయ్యగా మారింది. AIDMKతో కలిసి అడుగులు వేసినప్పటికీ...పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. డీఎమ్‌కే ఘన విజయం సాధించింది. AIDMKలో అంతర్గత పోరు మొదలవటమూ ఆ పార్టీని దెబ్బ తీసింది. కేరళ విషయానికొస్తే...2021లో జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు పార్టీకే పట్టం కట్టారు అక్కడి ప్రజలు. నాలుగు దశాబ్దాల్లో ఇలా రెండోసారి ఒకే పార్టీ అధికారంలోకి రావటం ఇదే తొలిసారి. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కేరళలో..భాజపా ఉనికి చాటుకోవటం కష్టతరమవుతోంది. ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. అయితే తెలంగాణలో మాత్రం జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలతో క్యాడర్‌లో కాస్తంత జోష్ వచ్చింది. తెరాస తరవాత రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే...ఇప్పుడు పార్లమెంట్‌లో సస్పెండ్ అవుతున్న ఎంపీలు ఎక్కువ మంది దక్షిణాదికే చెందిన వారు కావటం కాకతాళీయమా..? లేక కావాలనే ఇలా చేస్తున్నారా అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మాత్రం...కావాలనే దక్షిణాదికి చెందిన ఎంపీలపై వివక్ష చూపుతున్నారన్న విశ్లేషణ నడుస్తోంది.