Pandora Papers: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా లీక్.. బడాబాబుల ‘విదేశీ’ గుట్టురట్టు.. భారతీయ ప్రముఖులు కూడా!
ప్రపంచంలోని బడాబాబుల గుట్టురట్టు చేసిన ఈ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్‌లో 117 దేశాలకు చెందిన 600 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
ప్రపంచంలో బాగా పేరొందిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, కోటీశ్వరులు, సినిమా నటులు, కోటీశ్వరులు విదేశీ బ్యాంకుల్లో దాచిన డబ్బులు, ఆయా బ్యాంకు ఖాతాలకు చెందిన వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో ఎందరో భారతీయ ప్రముఖుల పేర్లు కూడా ఉండటం షాకిచ్చే విషయం. ‘పండోరా పేపర్స్’ పేరుతో బయటకు వచ్చిన ఈ పత్రాల్లో వారి రహస్య ఆస్తులు, వారి డీలింగ్స్‌కు సంబంధించిన సమాచారం మొత్తం ఉంది. ప్రపంచంలో బయటపడ్డ అతిపెద్ద ఆర్థిక పత్రాల లీకుల్లో దీన్ని కూడా ఒకటిగా భావిస్తున్నారు.
ఈ పండోరా పేపర్స్ ఇన్వెస్టిగేషన్‌లో ప్రపంచంలోని వేర్వేరు వార్తా సంస్థలకు చెందిన 600 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇందులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. విదేశీ ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బు, ఇతర ఆస్తులకు సంబంధించిన 1.19 కోట్ల డాక్యుమెంట్ల ఆధారంగా ఈ ఇన్వెస్టిగేషన్ చేశారు.
ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) దగ్గరకు ఈ డేటా రెండేళ్ల క్రితమే వచ్చింది. అయితే సంవత్సరం పాటు క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ వివరాలను వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ప్రపంచంలో ఎంతో ధనవంతులు, పవర్ ఉన్నవారు దాచుకున్న ఆస్తులు, పన్ను ఎగవేతలకు సంబంధించిన సమాచారాన్ని ఈ పత్రాలు బట్టబయలు చేశాయి. పండోరా పేపర్స్ మీద ఇచ్చిన మొదటి కథనంలో.. ఈ డాక్యుమెంట్లలో వేర్వేరు పద్ధతులు ఉన్నాయని తెలిపింది.
వీటిలో కొన్ని కీలక అంశాలు:
విదేశాల్లో అక్రమార్జన దాచుకునే వ్యవస్థను అంతం చేయగల సామర్థ్యం ఉన్న ఎంతో మంది ఆ వ్యవస్థకు ఎదురు నిలవకుండా.. నకిలీ కంపెనీలు, ట్రస్టుల్లో వారు తమ ఆస్తులను ఉంచి లాభాలు పొందుతున్నారని ఈ లీకైన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.
మాజీ రెవిన్యూ సర్వీస్ ఆఫీసర్, మాజీ ట్యాక్స్ కమిషనర్, మాజీ సీనియర్ ఆర్మీ ఆఫీసర్, ఎంతో పేరున్న మాజీ న్యాయ అధికారి.. ఇలా ఎంతో మందికి విదేశాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలు లీకయ్యాయి. ఇందులో 14 ఆఫ్‌షోర్ సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించిన రహస్య డేటా ఉంది.
ఎంతో మంది రాజకీయ నాయకులు, మనదేశానికి చెందిన మాజీ ఎంపీలు, ప్రభుత్వాధికారులు, సెన్సిటివ్ ట్రేడ్స్ చేసేవారు లేదా సమస్యాత్మక దేశాల్లో వ్యాపారాలు చేసేవారు, గతంలో భారత దర్యాప్తు సంస్థలు వేర్వేరు కేసుల్లో బుక్ చేసిన వారికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. భారతీయులతో సహా విదేశాల్లో అక్రమాస్తులు ఉన్న వారు పనామా పేపర్స్ లీకైన అనంతరం.. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వేరే దారులు ఎంచుకున్నారు. ‘ఎంతోమంది భారతీయ వ్యాపారులు విదేశాల్లో ట్రస్టులు ఏర్పాటు చేసి తమ ఆస్తులను కనిపించకుండా దాచుకుంటున్నారు’ అని ఈ కథనాల్లో పేర్కొన్నారు.
ఇప్పుడు దర్యాప్తులో బయటపడ్డవారిలో చాలా మంది సమోవా, బిలైజ్ లేదా కుక్ ఐల్యాండ్స్ లేదా పన్నులు ఎగ్గొట్టడానికి అంతకంటే వీలున్న బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ లేదా పనామా వంటి చోట్ల ఆఫ్‌షోర్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలోని దర్యాప్తు సంస్థల నిఘా నీడలో ఉన్న చాలా మంది వ్యక్తులకు కూడా ఇందులో భాగం ఉందని తెలుస్తోంది. వారి పేర్లు బయటకు రాలేదు కానీ.. వారిలో కొందరు జైల్లో ఉండగా.. కొంతమందికి బెయిల్ లభించింది.
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలుండి ప్రస్తుతం జైల్లో ఉన్న ఒక భారతీయ ఆర్థిక నేరస్తుడు తన ఆస్తులను వేర్వేరు ఆఫ్ షోర్ కంపెనీల్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇతను ఇటీవలే తన ఆఫ్‌షోర్ ఆస్తులతో ఒక పెద్ద చాలెంజర్ విమానాన్ని కూడా కొన్నాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.
ఈ ఆఫ్‌షోర్ వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు కూడా బయటపడ్డాయి. ప్రపంచంలోని ప్రతి చోటా ఈ ఆఫ్‌షోర్ మనీ మెషీన్ వ్యవస్థ ఉందని, ఆర్థికంగా ఎంతో శక్తివంతమైన అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ వ్యవస్థ ఉందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. పన్ను ఎగవేతలకు, మనీ లాండరింగ్‌కు ధనవంతులు, రాజకీయ నాయకులు ఎన్నుకున్న కొత్త పద్ధతులు కూడా ఈ డాక్యుమెంట్లలో ఉండే అవకాశం ఉంది.
బీబీసీ కథనం ప్రకారం.. 117 దేశాల్లోని 600 మంది జర్నలిస్టులు.. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఐసీఐజే వద్దనున్న డేటాలోని ఫైల్స్‌ను ఇన్వెస్టిగేట్ చేశారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఇన్వెస్టిగేషన్‌పై దాదాపు 140 మీడియా సంస్థలు పనిచేసినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో రహస్య సమాచారం లీక్ అవ్వడం ప్రపంచంలో ఇదే తొలిసారి. బీబీసీ కథనం ప్రకారం.. ఈ ఫైల్స్‌లో 90 దేశాలకు చెందిన 330 మందికి పైగా రాజకీయ నాయకులు తమ ఆస్తులను దాచిపెట్టడానికి విదేశీ కంపెనీలను ఉపయోగించారు.
I'm told by the reporting team this is the biggest offshore-finance leak—and journalistic collaboration—*ever.*
— Edward Snowden (@Snowden) October 3, 2021
They expose the intentionally concealed finances of 35 world leaders and 300+ other public officials in 90+ countries.
...and they aren't finished. https://t.co/wbw4Gpx8jT