Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే నెట్‌వర్క్‌లో భద్రతపై చర్చ జరుగుతోంది.
Odisha Train Accident:
సేఫ్‌టీ ఏది..?
ఒడిశా రైల్వే ప్రమాదం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. సిగ్నలింగ్ సిస్టమ్‌లో వైఫల్యం వల్లే యాక్సిడెంట్ అయిందని ప్రాథమికంగా చెబుతున్నప్పటికీ ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు. రైల్వేశాఖ నియమించిన కమిటీ విచారణ చేసిన తరవాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ "బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టం" అని గట్టిగానే చెప్పారు. అయితే...ఈ ప్రమాదం తరవాత రైల్వే భద్రతపై మరోసారి చర్చ జరుగుతోంది. ఇంత భారీ నెట్‌వర్క్ ఉన్న భారత్ రైల్వేలో "సేఫ్‌టీ" ఏది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం రైల్వేలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు భారీగా ఖర్చు పెడుతున్నామని చెబుతోంది. ప్రమాదం జరిగిన తీరు మాత్రం లోపాలను ఎత్తి చూపిస్తోంది. దీనిపై పలువురు నిపుణులు ఇప్పటికే స్పందించారు. రైల్వే నెట్‌వర్క్‌లో ఉన్న లూప్‌హోల్స్‌పై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా భద్రతా పరమైన చర్యలు జరుగుతున్నప్పటికీ...ఇంకా చేయాల్సింది చాలానే ఉందని తేల్చి చెబుతున్నారు.
వర్క్‌లోడ్ పెరుగుతోంది..
డిమాండ్‌కి తగ్గట్టుగా ట్రైన్‌లను పెంచుతున్నారు. కొత్త ట్రైన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ...ఆ స్థాయిలో వర్క్‌ఫోర్స్‌కి సిద్ధం చేయలేకపోతున్నారు. మెయింటెనెన్స్‌లో లోపాల వల్ల ప్రమాదాలు ఎదురవుతున్నాయన్నది కొందరు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న మాట. వర్క్‌లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల ట్రాక్‌లను చెక్ చేయడమూ తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోని ట్రాక్‌లు చాలా పాతవి. అంతే కాదు. దేశంలోనే అత్యంత బిజీగా ఉండే లైన్‌లు అవి. మన దేశంలో సప్లై అయ్యే బొగ్గు, చమురు ఎక్కువగా ఈ లైన్‌లోనే వస్తుంటాయి. ఇంత బిజీగా ఉండే ట్రాక్‌లను తరచూ చెక్ చేయకపోతే ఇలాంటి ఘోర ప్రమాదాలు చూడక తప్పదని తేల్చి చెబుతున్నారు నిపుణులు. International Railway Journal రాసిన శ్రీనాథ్ ఝా కూడా ఇండియన్ రైల్వే సిస్టమ్‌లోని సేఫ్‌టీపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. భద్రతా పరంగా చర్యలు తీసుకుంటున్నా అవి చాలా మందకొడిగా సాగుతున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా యాంటీ కొలిజన్ డివైస్‌లు (anti-collision devices) ఏర్పాటు చేయడంలో జాప్యం..ఇలా ప్రాణాలు తీస్తోంది. ఈ రూట్‌లో కవచ్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడమూ మరో సమస్యగా మారింది. గతంతో పోల్చుకుంటే ప్రమాదాల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పటికీ కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ భారత్‌ది. రోజుకి కనీసం కోటి 30 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. 2017-18 సమయంలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు కేవలం సేఫ్‌టీ కోసమే కేటాయించినప్పటికీ ఇంకా కొన్ని లైన్‌లలో భద్రతా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
మోదీ హామీ..
ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత మంది చనిపోవడం కలచివేసిందన్నారు. బాలాసోర్ మెడికల్ కాలేజీకి వెళ్లిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందుకున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తాం, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం అన్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Also Read: Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!