NTPC Green Hydrogen Project: ఇండియాకు హైడ్రోజన్ ఫ్యూయల్ ఇచ్చేది వైజాగ్ నుంచే.. లక్షా 80వేల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు. రేపే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
దేశం మొత్తానికి గ్రీన్ ఎనర్జీ ఇచ్చే భారీ ప్రాజెక్ట్ జనవరి 8న ప్రారంభం కాబోతోంది. లక్షా 81వేల కోట్ల పూడిమడక NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు
ఇప్పుడు మనం వాడుతున్న పెట్రోల్, డీజిల్ ఇక ఉండదు. థర్మల్ స్టేషన్ల నుంచి వస్తున్న విద్యుత్ ఉండకపోవచ్చు. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీనే ఉండబోతోంది. ఇప్పటికే ఉత్పత్తి అవుతున్న రెన్యువల్ ఎనర్జీ సోర్సులు అయిన సోలార్, విండ్ పవర్‌లకు తోడుగా గ్రీన్ హైడ్రోజన్ రాబోతోంది. దీని ఉత్పత్తికి మన విశాఖపట్నం కేరాఫ్ అడ్రస్ కాబోతోంది. ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖ సమీపంలోని పూడిమడక సమీపంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ NTPC నిర్మిస్తోంది. లక్ష 81వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు దేశం మొత్తానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానుంది. ఇప్పటికే APIIC ఈ ప్రాజెక్టుకు 1200 ఎకరాల భూమిని అప్పగించింది.
కాలుష్యానికి కేరాఫ్‌గా మారుతున్న డీజిల్, పెట్రోల్ వాహనాలు స్థానంలో కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. వాటి వినియోగం కూడా పెరిగిపోయింది. అయితే ఎలక్ట్రిక్ కన్నా మరింతగా ఉద్గారాలను తగ్గించే ఆల్టర్‌నేటివ్ గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుటికే ప్రధాన నగరాల్లో డీజిల్ తో నడుస్తున్న పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సులను ఎలక్ట్రిక్ కు మారుస్తున్నారు. భవిష్యత్‌లో వీటిని పూర్తిగా హైడ్రోజన్ సెల్ ఫ్యూయల్ బస్సులుగా మారుస్తారు.
నేషనల్ గ్రీన్ ఎనర్జీ మిషన్
గ్రీన్ ఎనర్జీ మిషన్ అన్నది ఇండియాకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అందులో భాగంగా 2070 నాటికి భారత్లో కర్బన ఉద్గారాలను పూర్తిగా జీరో చేయాలన్నది లక్ష్యం. అంటే మనం తిరిగే వాహనాలు, పరిశ్రమలు, ఎలక్ట్రిసిటీ వీటన్నింటిలో జీరో ఎమిషన్స్ తీసుకురావాలన్నది లక్ష్యం. దానికోసమే రాజస్థాన్, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో భారీ సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పారు. ప్రైవేటు రంగంలో వస్తున్న ప్లాంట్లతో పాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ ఇందులో ముఖ్య పాత్ర వహిస్తోంది. NTPC అనుబంధ సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL పెద్ద ఎత్తున రెన్యూవల్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. రామగుండంలోని సోలార్ ప్లాంట్లు, తమిళనాడులో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, పలు చోట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు.
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
అయితే ఇప్పుడు వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్న ప్లాంట్ అన్నది పూర్తిగా వేరే లెవల్. టోటల్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు అయిన ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు.. భారత రవాణా రంగం రూపురేఖలనే మార్చబోతోంది. ఇప్పుడు ఇండియా నుంచి ఉత్పత్తి అవుతున్న ఎమిషన్స్‌లో 40శాతం వాహనరంగం నుంచే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్, గ్రీన్ ఫ్యూయల్ వాహనాలుగా మార్చే మిషన్ కు ఈ ప్రాజెక్టు చాలా కీలకం. దీని నుంచి ప్రతి రోజూ 1500 మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 1500 మెట్రిక్ టన్నుల గ్రీన్ ఇథనాల్, 1500 మెట్రిక్ టన్నుల సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, 4500 టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయనున్నారు. 2032 నాటికి 5మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నది భారత్ లక్ష్యం. ఆ దిశగా ఈ ప్లాంట్ ఏర్పాటు కీలక అడుగు. ఇప్పుటి వరకూ మన దగ్గర హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారీలేదు. ఎన్టీపీసీనే లద్దాక్ లో గ్రీన్ ఎనర్జీ మెబిలిటీ ప్లాంట్ ను ఏర్పాటు చేసి అక్కడ కొద్దిగా ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది ఈ ప్రాజెక్టు ద్వారా లేహ్ లద్దాక్ లోనూ, గ్రేటర్ నోయిడాలోనూ పైలట్ పద్దతిలో హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సులను ప్రారంభించారు. రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హైడ్రోజన్ ఫ్యూయల్ కారును దిగుమతి చేసుకుని ఢిల్లీలోని రీసెర్చ్ సెంటర్లో దానికి హైడ్రోజన్ ఫ్యూయల్ ఇస్తున్నారు.
గేమ్ చేంజర్‌గా వైజాగ్
NTPCకి వైజాగ్ సమీపంలోని పరవాడ దగ్గర సింహాద్రి పేరుతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. దీనికి మరి కాస్త దూరంలోని పూడిమడక దగ్గర ఈ కొత్త ప్రాజెక్టు రాబోతోంది. మొదట్లో దీనిని కూడా థర్మల్ ప్లాంట్ గానే ప్రతిపాదించారు. ఆ తర్వాత ప్రయారిటీని మార్చి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుగా మార్చారు. ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగింది. ఈ ప్రాజెక్టుకు సమీపంలోనే గంగవరం, విశాఖ సీ పోర్టులున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన మిథనాల్‌ను ఈ పోర్టుల ద్వారా ఎగుమతి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనికి అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది.
గో గ్రీన్ అప్రోచ్
2032 నాటికి 60 గిగావాట్స్ రెన్యూవల్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలన్నది ఎన్టీపీసీ లక్ష్యం. ఇప్పటికి 5 గిగావాట్ల ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి. మరో 22 గిగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. సోలార్, విండ్, న్యూక్లియర్ వంటి ఇతర ప్రాజెక్టులు ఇందులో ఉన్నా.. ఈ గ్రీన్ హైడ్రోజన్ అన్నది మాత్రం చాలా ప్రత్యేకం. ఇప్పటికైతే ఇందుకోసం భారీగా నీరు, ఎలక్ట్రిసిటీ అవసరం. ఉత్పత్తి ఖర్చు కూడా ఎక్కువే. ప్రస్తుతానికి కిలో హైడ్రోజన్ ఫ్యూయెల్ కు 3 డాలర్లు ఖర్చు అవుతోంది. దీనిని ఒక డాలర్ కు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సాంప్రదాయ ఇంధన వనరులు అయిన పెట్రోల్, డీజిల్ వంటి వాటితో జరుగుతున్న నష్టం, వాటి లభ్యత తగ్గడం వంటి కారణాలతో ఇక ఫ్యూచర్ అంతా హైడ్రోజన్ ఫ్యూయల్ ఉండే అవకాశం ఉంది. హైడ్రోజన్ ఉత్పత్తిలో ముందుకు వెళితే.. ఇంధన దిగుమతుల భారం తగ్గడమే కాదు...ఎగుమతుల ద్వారా భారత్ కీలక శక్తిగా ఎదిగేందుకూ అవకాశం ఉంటుంది. అందుకే భారత్ ఈ దిశగా పయనాన్ని ప్రారంభించింది.