Nitish Kumar: మగాళ్లకు పట్టదు ఆడవాళ్లకు తెలియదు, జనాభా నియంత్రణపై నితీశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Nitish Kumar: జనాభా నియంత్రణపై బిహార్ సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Bihar CM Nitish Kumar:
సమాధాన్ యాత్రలో...
జనాభా నియంత్రణపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. వైశాలిలో ఓ పబ్లిక్ మీటింగ్‌లో జనాభా నియంత్రణపై సంచలన వ్యాఖ్యలు చేశారు నితీశ్. ఈ విషయంలో పురుషులు బాధ్యతగా ఉండరని, మహిళలేకు అవగాహన తక్కువగా ఉండటం వల్ల సమస్యగా మారుతోందని అన్నారు. సమాధాన్ యాత్రలో ఈ కామెంట్స్ చేశారు.
"పురుషులకు ఏమీ పట్టదు. ఆ తరవాత ఏం జరుగుతుందో అని ఆలోచించరు. మహిళలకేమో దానిపై అవగాహన ఉండదు. వాళ్లు వద్దు అని చెప్పలేకపోవడం వల్లే జనాభా నియంత్రణ సాధ్యపడటం లేదు. మహిళల్లో అవగాహన పెరిగినప్పుడే ఇది సాధ్య పడుతుంది. గర్భం దాల్చకుండా మహిళలు తమను తాము రక్షించుకోవడం ఎలాగో తెలుసుకోవాలి"
- నితీశ్ కుమార్
దీనిపై రాజకీయంగా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి నితీష్‌పై మండి పడ్డారు. బిహార్ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చారని విమర్శించారు. "అలాంటి భాష వాడుతూ సీఎం చేసిన వ్యాఖ్యల్ని ఖండించాల్సిందే. ముఖ్యమంత్రి పదవికే మచ్చ తెస్తున్నారు" అని అన్నారు.
Nitish's 'men not ready to take responsibility' remark sparks uproar, BJP slams him for indecency
— ANI Digital (@ani_digital) January 8, 2023
Read @ANI Story | https://t.co/A3MWnhCFvr
#NitishKumar #BJP pic.twitter.com/rQgWQoesUR
మద్య నిషేధంపై..
బిహార్‌లో చప్రా, సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో బీజేపీ, నితీష్ మధ్య వాగ్వాదమూ కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ మరణాలన్నీ...అంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. అటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా గట్టిగానే బదులిస్తున్నారు. మద్య నిషేధం పకడ్బందీగా అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "మద్యం సేవించిన వాళ్లెవరైనా సరే ఇలాగే ప్రాణాలు కోల్పోతారు. మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున పరిహారం కూడా ఇవ్వం. మేం ఎప్పటి నుంచో ఇదేచెబుతున్నాం. మద్యపానం గురించి సానుకూలంగా మాట్లాడే వాళ్లతో మీకు కలిగే ప్రయోజనమేమీ లేదు" అని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందే మీడియాతో మాట్లాడిన సమయంలో "కల్తీ మద్యం సేవించిన వారెవరైనా ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటారు" అని తేల్చి చెప్పారు నితీష్ కుమార్. మద్య నిషేధం పథకం వల్ల చాలా మంది ఆ వ్యసనం నుంచి బయటపడ్డారని మరోసారి స్పష్టం చేశారు. 2016 ఏప్రిల్ నుంచే బిహార్‌లో మద్య నిషేధం అమలవుతోంది. "మద్యం మానేసి సాధారణ జీవితం గడుపుతున్న వాళ్లెందరో ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఘటనను మాత్రం అసలు ఉపేక్షించం. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారెవరైనా సరే వారిని పట్టుకుంటాం. కఠినంగా శిక్షిస్తాం" అని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు.
Also Read: Air India: ఫ్లైట్‌లో ఆల్కహాల్ బ్యాన్ చేయాలా? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సర్వే