Air India: ఫ్లైట్‌లో ఆల్కహాల్ బ్యాన్ చేయాలా? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సర్వే
Air India: విమానాల్లో ఆల్కహాల్ సర్వ్ చేయాలా వద్దా అనే అంశంపై సర్వే జరిగింది.
Air India:
లోకల్ సర్కిల్స్ సర్వే
ఎయిర్ ఇండియాలో ఓ వ్యక్తి మహిళపై యూరినేట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. మొత్తానికి ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే...ఈ క్రమంలోనే ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. విమానాల్లో డ్రింక్స్‌ని సర్వ్ చేయొచ్చా లేదా అన్న ఆలోచనలో పడ్డాయి యాజమాన్యాలు. దీనిపైనే సర్వే చేయగా...ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. దాదాపు 48% మంది ప్రయాణికులు విమానాల్లో మద్యం ఇవ్వడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. 89% మంది మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా సెక్యూరిటీ కల్పించాలని అడిగారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన LocalCircles ఈ సర్వే చేపట్టింది. మద్యం సేవించి విమానం ఎక్కకుండా ముందుగానే ప్రయాణికుల నుంచి అండర్‌టేక్ తీసుకోవాలని 50% మంది అభిప్రాయం వెల్లడించారు. ఇక...వెంట తెచ్చుకున్న ఆల్కహాల్‌ను విమానంలో తాగకుండా ఆంక్షలు విధించాలని 32% మంది కోరారు. మరో 40% మంది ఆసక్తికర విషయం చెప్పారు. విమానం
ఎక్కే ముందే బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేసి...ఆ రిజల్ట్ ఆధారంగా విమానం ఎక్కాలా వద్దా అన్నది తేల్చాలని చెప్పారు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా విమానాల్లో ఇబ్బందికర ఘటనలు జరిగాయి. మద్యం మత్తులో కొందరు అనుచితంగా ప్రవర్తించడం వల్ల తోటి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సేఫ్‌టీపైనా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో..ఈ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
నిందితుడి అరెస్ట్..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మహిళపై యూరినేట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులు బెంగళూరులో శంకర్ శేఖర్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నవంబర్ 26న ఈ ఘటన జరగ్గా...అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు...ఎట్టకేలకు బెంగళూరులో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఉన్నాడన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా...ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఓ టీమ్‌ని అక్కడికి పంపించారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నప్పటికీ..సోషల్ మీడియా అకౌంట్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. వీటి ద్వారానే పోలీసులు నిందితుడిని ట్రాక్ చేశారు. ఒకే ప్లేస్‌లో ఉండటంతో పాటు క్రెడిట్ కార్డ్ కూడా వినియోగించినట్టు విచారణలో తేలింది. నిజానికి...శంకర్ శేఖర్ శర్మ బాధితురాలితో మాట్లాడాడు. పరిహారం కింద రూ.15,000 కూడా చెల్లించాడు. కంప్లెయింట్ వెనక్కి తీసుకోవాలని కోరాడు. అయితే...బాధితురాలి కూతురు మాత్రం ఇది అంగీకరించలేదు. డబ్బు తిరిగి ఇచ్చేసింది. అప్పటి నుంచి మళ్లీ కేసు మొదటికి వచ్చింది. అమెరికాలోని వెల్స్‌ఫార్గో కంపెనీలో పని చేస్తున్న శంకర్ శర్మను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది. ఇలా ప్రవర్తించే వారికి తమ కంపెనీలో చోటు ఇవ్వలేమని,క్రెడిబిలిటీ కోల్పోలేమని స్పష్టం చేసింది యాజమాన్యం.