New Year 2025: న్యూ ఇయర్ కి సిద్దమైన దేశ రాజధాని, 10 వేల సిబ్బందితో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు భద్రతను ముమ్మరం చేశారు. అదనపు పెట్రోలింగ్‌లు, బ్రీత్‌నలైజర్లు, క్యూఆర్‌టీలు, 10,000 మందికి పైగా అధికారులను మోహరించారు.
New Year 2025: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నగరంలోని కీలక ప్రాంతాల్లో అదనపు పెట్రోలింగ్, ప్రత్యేక విభాగాలను మోహరించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్ తెలిపారు. "వాహనాల కదలికలను నియంత్రించడానికి, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే సంఘటనలను నిరోధించడానికి 21 వ్యూహాత్మక ప్రదేశాలలో బ్రీత్ ఎనలైజర్‌లతో కూడిన భద్రతా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశాము" అని డీసీపీ తెలిపారు.
పారామిలటరీ బలగాలతో భద్రత
నూతన సంవత్సరం సందర్భంగా దేశ రాజధానిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు నగర సరిహద్దు పాయింట్ల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించింది. ఇందుకు 10,000 మంది అధికారులు విధుల్లో ఉండనున్నారు. ఇక అత్యంత వేగంగా స్పందించేందుకు క్విక్ రియాక్షన్ టీమ్‌లు - క్యూఆర్‌టీలు 15 క్రిటికల్ పాయింట్‌ల వద్ద ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు వ్యూహాత్మకమైన 38 పీసీఆర్ వాహనాలను ఉంచినట్లు ఆయన తెలిపారు.
బస్టాపుల్లోనూ భద్రత పెంపు
దేశ భద్రతలో భాగంగా ఆయా బస్టాపులు, క్లిష్టమైన రహదారి మార్గాలలో కూడా భద్రతను పెంచారు. 40 మోటార్ సైకిళ్లపై సిబ్బందిని మోహరించారు. అంతేకాకుండా రెస్టారెంట్లు, హోటళ్లలో నిర్వహించే ప్రత్యేక వేడుకలను దృష్టిలో పెట్టుకుని 8 ప్రముఖ హోటళ్లపైనా నిఘా పెంచామని అధికారులు తెలిపారు. దాదాపు అలాంటి 31 కీలక ప్రదేశాలను గుర్తించిన అధికారులు.. 15 మాల్స్, హోటళ్లు, సినిమా హాళ్లు లాంటి ఇతర ప్రముఖ సమావేశ ప్రదేశాలలోనూ కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా విస్తరణలో భాగంగా 130 మంది మహిళా సిబ్బందితో పాటు ఏడుగురు అసిస్టెంట్ కమిషనర్లు, 40 మంది ఇన్‌స్పెక్టర్లు, 223 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు అందుబాటులో ఉండనున్నారు.
భద్రతా ఏర్పాట్లలో విభజన
న్యూఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను సీనియర్ అధికారుల పర్యవేక్షణలో రెండు జోన్లుగా విభజించారు. పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్‌లు జోన్ 1 కింద వర్గీకరించారు. జోన్ 2లో చాణక్య పురి, బరాఖంబా రోడ్, తుగ్లక్ రోడ్‌లు ఉన్నాయి. ఇక న్యూ ఇయర్ సందర్భంగా కన్నాట్ ప్లేస్ కు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే పర్మిట్లు ఉన్న వాహనాలను మాత్రమే ఇన్నర్ సర్కిల్ ప్రాంతంలోకి అనుమతించనున్నారు. కన్నాట్ ప్లేస్ తో పాటు హౌజ్ ఖాస్, ఇండియా గేట్, మాల్స్, మార్కెట్‌ల సమీపంలోని ప్రాంతాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశామని డీసీపీ చౌహాన్ తెలిపారు.
Also Read : South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి