PM Modi: మోదీ బస చేసిన హోటల్‌కి బిల్ ఎగ్గొట్టిన అధికారులు, లీగల్ యాక్షన్‌కి సిద్ధమైన యాజమాన్యం
Karnataka: ప్రధాని మోదీ గతేడాది మైసూరులోని హోటల్‌లో బస్ చేయగా అందుకు సంబంధించిన బిల్‌ని ఇంకా క్లియర్ చేయకపోవడం వివాదాస్పదమవుతోంది.

PM Modi Karnataka Visit: గతేడాది కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అక్కడ పర్యటించిన సమయంలో మైసూరులోని ఓ హోటల్‌లో బస చేశారు. రూ.80 లక్షల బిల్లు బాకీ ఉందంటూ హోటల్ యాజమాన్యం కీలక విషయం వెల్లడించింది. వెంటనే చెల్లించకపోతే లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర అటవీశాఖ ఈ బిల్స్‌ని చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. The Hindu ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం..గతేడాది ఏప్రిల్‌లో మైసూరులో Radisson Blu Plaza హోటల్‌లో ప్రధాని మోదీ బస చేశారు. Project Tiger event కి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. ఏప్రిల్ 9-11 వరకూ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. రూ.3 కోట్ల బడ్జెట్ కూడా అప్పట్లో కేటాయించింది. కేంద్ర ప్రభుత్వమే ఈ ఖర్చులు భరిస్తుందని వెల్లడించింది. అయితే...ఈ ఈవెంట్‌కి అనుకున్న దాని కన్నా ఎక్కువ ఖర్చైంది. కేంద్రం ముందుగా అనుకున్నట్టుగానే రూ.3 కోట్ల నిధులు విడుదల చేసింది. మరో రూ.3.3 కోట్ల వరకూ నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయమై కర్ణాటక అటవీ శాఖ చాలా సార్లు కేంద్ర కేంద్ర పర్యావరణశాఖకు గుర్తు చేసింది. నిధులు విడుదల చేయాలని కోరింది. ప్రధాని మోదీ వస్తున్నందున అదనపు ఏర్పాట్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ ఈవెంట్‌ని నిర్వహించిన సంస్థ అన్ని లెక్కలు వేసి అధికారులందరికీ పంపింది.
మండి పడుతున్న హోటల్ యాజమాన్యం..
గతేడాది అక్టోబర్‌లో National Tiger Conservation Authority అధికారులకు కర్ణాటక వైల్డ్‌లైఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ లేఖ రాశారు. మిగలిన నిధులు విడుదల చేయాలని కోరారు. దానికి బదులు ఇచ్చిన NTCA అధికారులు హోటల్ బిల్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని తేల్చి చెప్పారు. మరోసారి ఈ ఏడాది మార్చి నెలలో కర్ణాటక అటవీ శాఖ అధికారులు NTCAకి లేఖ రాశారు. హోటల్ బిల్లు రూ.80.6 లక్షలు చెల్లించాలని చెప్పారు. ఇప్పటి వరకూ మళ్లీ NTCA నుంచి ఎలాంటి బదులు రాలేదు. ఈ క్రమంలోనే హోటల్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. మే 21న అధికారులకు లేఖ రాసింది. హోటల్ సర్వీస్‌లను వాడుకుని సంవత్సరం అయినా ఇప్పటికీ బిల్లు కట్టలేదని అసహనం వ్యక్తం చేసింది. 18% వడ్డీతో కలుపుకుంటే అదనంగా రూ.12.09లక్షల చెల్లించాల్సి ఉందని తేల్చి చెప్పింది. జూన్ 1వ తేదీలోగా ఈ చెల్లింపులు జరగకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. అయితే...ఇప్పటి వరకూ అధికారులు ఈ హెచ్చరికలపై స్పందించలేదు. అటు హోటల్ యాజమాన్యం మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ బిల్ క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తోంది. 12 నెలలు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమంటూ మండి పడుతోంది. అటు రాష్ట్ర అటవీ శాఖ మాత్రం కేంద్రం ఇస్తే తప్ప తాము ఏమీ చేయలేమని తేల్చి చెబుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

