26/11-Type Terrorist Attack: 26/11 లాంటి దాడులు చేస్తాం, ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నంబర్‌కు మెసేజ్‌లు
Mumbai Traffic Police: ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్‌కు ఓ ఆగంతకుడు మెసేజ్‌లు పంపాడు. 26/11 లాంటి దాడులు చేస్తామని హెచ్చరించాడు.
26/11-Type Terrorist Attack:
పాకిస్థాన్ నంబర్ నుంచి..!
ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఉగ్రదాడుల బెదిరింపులు వచ్చాయి. కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్‌కు కొన్ని టెక్స్ట్ మెసేజ్‌లు వచ్చాయి. "26/11లాంటి దాడి చేస్తాం" అని మెసేజ్‌లు పంపాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ నంబర్‌ను ట్రాక్ చేసిన పోలీసులు...విదేశాల నుంచి ఈ మెసేజ్‌లు వచ్చినట్టు నిర్ధరించారు. "సెంట్రల్ ముంబయిలోని వర్లి ప్రాంతంలో ఉన్న ముంబయి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్‌లు వచ్చాయి. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఈ మెసేజ్‌లు పంపాడు" అని ఉన్నతాధికారులు వెల్లడించారు. వరుసగా
ఎన్నో మెసేజ్‌లు వచ్చాయని...అందులో 26/11 అటాక్‌కు సంబంధించిన మెసేజ్ కూడా ఉందని తెలిపారు. సిటీ క్రైమ్ బ్రాంచ్ దీనిపై విచారణ జరుపుతోంది. ప్రాథమిక విచారణలో తేలిందేంటంటే..పాకిస్థాన్‌కు చెందిన నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చిందని. ఆరుగురు కలిసి మరోసారి అటాక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు హెచ్చరికలు పంపాడు ఆగంతుకుడు. 2008లో నవంబర్ 26వ తేదీన ముంబయిలోని తాజ్‌హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 166 మంది పౌరులు మృతి చెందారు. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. పది మంది ఉగ్రవాదులు తెగబడ్డారు. దేశంలోనే అతి భయానకమైన ఘటనగా నిలిచిందిది.
A threat message warning of a 26/11-like terrorist attack was sent to the WhatsApp number of Mumbai Police traffic control from a Pak-based phone number. The threat message states that 6 people will execute the plan in India. Probe underway: Mumbai Police source
— ANI (@ANI) August 20, 2022
ప్రపంచమంతా ఉలిక్కిపడిన ఘటన..
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 26/11 ఉగ్రదాడుల కేసులో పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్ట్ ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. 2008లో ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారికి 15 ఏళ్ల జైలు శిక్షవిధించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఇలా తీర్పు నిచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన యాక్టివిస్ట్ సాజిద్ మజీద్ మిర్‌కు లాహోర్ కోర్ట్ ఈ శిక్ష వేసింది. టెర్రర్
ఫైనాన్సింగ్ కేసులను వాదించే ఓ సీనియర్ న్యాయవాది ఈ వివరాలు వెల్లడించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్-CTD ఈ తరహా కేసుల్లో శిక్ష పడిన వాళ్ల వివరాలను మీడియాకు వెల్లడిస్తుంది. కానీ ఈ కేసులో ఆ సమాచారాన్ని బయటకు పొక్కనివ్వలేదు. జైల్‌లో కెమెరా ప్రొసీడింగ్ కొనసాగటం వల్ల మీడియాను అనుమతించలేదు.
మిలియన్ డాలర్ల నజరానా
ఈ కేసులో ప్రధాన నిందితుడైన మజీద్ మిర్‌ను ఏప్రిల్‌లోనే అరెస్ట్ చేశారు. కోట్ లఖ్‌పత్ జైల్‌లో ఉంచారు. అప్పటి నుంచి విచారణ అంతా జైల్‌లోనే సాగింది. ఈ ప్రక్రియ ముగిశాక లాహోర్ కోర్ట్ శిక్ష విధించింది. 15ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 4 లక్షలు జరిమానా కూడా విధించినట్టు న్యాయవాది తెలిపారు. నిజానికి మజీమ్ మిర్ ఎప్పుడో చనిపోయి ఉంటారనే అంతా భావించారు. కానీ పాకిస్థాన్ ఉన్నట్టుండి ఓ ప్రకటన చేసింది. ఎఫ్‌ఏటీఎఫ్‌లో ఎప్పటి నుంచో గ్రే లిస్ట్‌లో ఉండిపోయిన పాక్, ఆ మచ్చను తొలగించుకునే ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశామని సంచలన నిజం వెల్లడించింది. మజీద్ మిర్ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రకటన వచ్చింది. ముంబయిలో 26/11 దాడుల్లో కీలక పాత్ర పోషించిన సాజిద్ భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లోనూ ఉన్నాడు. ముంబయి దాడుల్లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా సాజిద్ వ్యవహరించాడని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.