Delhi Liqour ScaM Telugu Link : తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు - ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు తెలుగు రాష్ట్రాల్లో కొంత మంది ప్రముఖులకు దడ పుట్టిస్తోంది. వారి పాత్ర ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
Delhi Liqour ScaM Telugu Link : ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ మార్చి భారీ అవినీతికి పాల్పడిందని సీబీఐ కేసు నమోదు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం ప్రారంభమయింది. దీనికి కారణం తెలుగు లింకులు కూడా ఎక్కువగానే ఉండటం. ఇప్పటికే సీబీఐ హైదరాబాద్‌లోనూ సోదాలు నిర్వహించింది. టీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ కొంత మంది.. కాదు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఉన్నారంటూ మరికొంత మంది ప్రచారం చేస్తున్నారు. దీంతో ముందు ముందు లిక్కర్ స్కాం ప్రకంపనలు ఏపీలోనూ వినిపించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగువారి ప్రమేయం !
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో సీబీఐ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన వివరాలు మాత్రమే కాకుండా అంతర్గతంగా చేసిన పలు ఆరోపణల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి ప్రమేయం కనిపిస్తోంది. నేరుగా ఎఫ్ఐఆర్‌లో ఓ ఐఏఎస్ అధికారి పేరుతో పాటు అరుణ్ రామచంద్ర పిళ్లై అనే పర్మినెంట్ అడ్రెస్ హైదరాబాద్ పేరుతో ఉన్న వ్యాపారి పేరును చేర్చారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నట్లుగా పరోక్ష ఆరోపణలు చేశారు. ఇది ప్రాథమిక ఎఫ్ఐఆర్ మాత్రమేనని.. ముందు ముందు చాలా మంది కొత్తగా నిందితులు చేరుతారని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది.
మొత్తం తెలంగాణలోనే జరిగిందంటున్న బీజేపీ !
ఢిల్లీ బీజేపీ ఎంపీ సర్వేశ్ శర్మ తెలంగాణ నేతలను టార్గెట్ చేసి మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి అసలు కథ అంతా హైదరాబాద్‌లోనే నడిచిందంటున్నారు. ఎక్కడెక్కడ సమావేశమయ్యారో... హోటల్స్ వివరాలు కూడా ఉన్నాయంటున్నారు. తెలంగాణకు చెందిన అరబిందో ఇండస్ట్రీస్ కీలక వ్యక్తి శరత్ చంద్రారెడ్డి పేరు లిక్కర్ స్కాంలో వినిపిస్తోంది. ఆయనకు ఓ లిక్కర్ సిండికేట్‌తో సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈయన వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడుగా భావిస్తున్నారు. మరో వైపు లిక్కర్ వ్యాపారంలో దిగ్గజంగా పేరున్న మాగుంట పేరు కూడా వినిపిస్తోంది. ఆయన కంపెనీలు మూడు చోట్ల సిండికేట్లను దక్కించుకున్నాయి. ఇందు కోసం రూ. కోట్లను మడుపులుగా చెల్లించినట్లుగా సీబీఐ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపైనా సీబీఐ దృష్టి పెట్టనుంది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం !
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ ఈ అంశాలన్నీ పైపైన వెల్లడించింది. ప్రాథమిక నివేదిక మాత్రమే దాఖలు చేసింది. ఇంకా చాలా అంశాలపై దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఎవరెవరు డబ్బులిచ్చారు.. ఏ రూపంలో తీసుకున్నారో కూడా విరవాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా తెలంగాణకు చెందిన కొంత మంది టీఆర్ఎస్ నేతలతో పాటు అరబిందో శరత్ చంద్రారెడ్డి , మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు ప్రచారంలోకి వస్తున్నాయి. అసలు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా.. హైదరాబాద్ వచ్చి.. డీల్స్ చేసుకున్నారని.. ఇదంతా టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో జరిగిందని బీజేపీ అంటోంది. మొత్తానికి ఈ కేసు ముందు కు సాగే కొద్దీ.. తెలుగు రాష్ట్రాల్లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కొంత మంది ప్రముఖుల్లో ఇప్పటికే గుబులు ప్రారంభమయింది