Raghurama Vs YSRCP : చేతకాకపోతే వైదొలగాలి.. టీటీడీ చైర్మన్, ఈవోలకు ఎంపీ రఘురామ సలహా..!
టీటీడీలో ప్రతీ దానికి ధరలు పెంచడం, కల్యాణ మండపాలు అద్దెకివ్వడంపై ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీని నిర్వహించడం చేతకాకపోతే వైదొలగాలని చైర్మన్, ఈవోలకు సూచించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, అధికారుల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు చేశారు. నిర్వహించడం చేతకాకపోతే వైదొలగాలని సలహా ఇచ్చారు. రఘురామకృష్ణరాజు ఆగ్రహానికి కారణం టీటీడీ కల్యాణ మండపాలను అద్దెకివ్వాలని నిర్ణయించి.. ఈమేరకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరడమే. టీటీడీ కల్యాణ మండపాలు నిర్వహణ లేక పాడుబడిపోతున్నాయని కొన్ని చోట్ల గెదెలను కట్టేస్తున్నారన్న నివేదికలు అందడంతో టీటీడీ కల్యాణ మండపాలను అద్దెకివ్వాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తప్పని.. భక్తులు ఇచ్చిన భూముల్లో కల్యాణ మండపాలు నిర్మించారని, వాటిని ఎవరికో అద్దెకివ్వడం మంచిది కాదన్నారు. అద్దెకు తీసుకున్న వారు అక్కడ సువార్త సభలను నిర్వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. కల్యాణ మండపాల నిర్వహణ చేతకాకపోతే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డి టీటీడీ పదవుల నుంచి తప్పుకోవాలని సలహా ఇచ్చారు.
ప్రజలు, ప్రముఖులు ఇచ్చిన వందల కోట్ల విరాళాలతో నిత్యన్నదానం నిర్వహిస్తున్నారని ఇప్పుడు దాన్ని కూడా నిలిపివేయాలన్న ఆలోచన సరి కాదన్నారు. ఆగమ మండలి ఏర్పాటు మీద దృష్టి పెట్టాలని నిష్ణాతులైన వారిని ఆగమ మండలిలో నియమించాలన్నారు. తిరుపతిలో వరుసగా చార్జీలు పెంచడంపైనా మండిపడ్డారు. జెరూసలేం వెళ్లే వారికి సబ్సిడీ ఇస్తూ టీటీడీలో అన్నింటికీ డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులను దోపిడీ చేయడమేమిటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని హెచ్చరించారు. మద్యం కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా చిన్న చిన్న బాటిళ్లు తీసుకు రావాలని ప్రయత్నించడంపై మండిపడ్డారు. మన ప్రభుత్వం మద్యం కొనుగోలుదారుల రక్తం పీలుస్తోందని జగన్‌పై అసంతృప్తి వ్యక్త చేసారు. మద్యంపై ఇప్పటికే సీఎం జగన్ వేలకోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇంకో 25 వేల కోట్ల రూపాయల అప్పు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఏపీలో ఇసుక దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయని సెటైర్లు వేశారు. ఇటీవల జేపీ వపర్ వెంచర్స్ అనే సంస్థపై వస్తున్న ఆరోపణలతో ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారికి రఘురామకృష్ణరాజు అభినందనలు తెలిపారు. తెలుగు వారైన పీఎస్ నర్సింహతో పాటు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేసిన జేకే మహేశ్వరిలు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయడం ఎంతో శుభపరిణామన్నారు.
మరో వైపు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీలో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎంఎస్ఓ లైసెన్స్ ఉపయోగిస్తోందని తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997కు విరుద్ధమన్నారు. బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎంఎస్ఓ లైసెన్స్ పొందలేవని చెప్పారు. ఏపీ ఫైబర్‌నెట్‌ను అనర్హత జాబితాలో చేర్చాలని కోరారు. తక్షణమే చర్యలు తీసుకొని అక్రమ లైసెన్స్‌ను రద్దు చేయాలని లేఖలో కోరారు.