(Source: ECI/ABP News/ABP Majha)
MCD Election Results 2022: కాంగ్రెస్ కథ ఏ మాత్రమూ మారలేదు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే చేదు అనుభవం
MCD Election Results 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు.
MCD Election Results 2022:
దారుణంగా పడిపోయిన ఓటు షేర్..
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. కేవలం 9 వార్డులకే పరిమితమైంది ఆ పార్టీ. అంతే కాదు. ఓటు షేర్ కూడా దారుణంగా పడిపోయింది. 2017 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 30 వార్డుల్లో విజయం సాధించింది. 21% ఓటు షేర్‌ని రాబట్టుకుంది. ఈసారి ఈ ఓటు షేర్ 11.68%కి పడిపోయింది. ఆప్ అభ్యర్థులతో పోటీ పడలేక చాలా వార్డుల్లో వెనకబడిపోయింది. 2017 ఎన్నికల్లో విజయం సాధించి...కాంగ్రెస్‌కు కంచుకోటలు అనిపించుకున్న స్థానాలనూ చేజార్చుకుంది. ఓల్డ్ ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ బేస్‌లోనూ ఓటమి పాలైంది. సీతారాం బజార్ వార్డ్‌లో 2007,2012,2017లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. కానీ...ఈసారి ఈ వార్డులోని
ప్రజలు ఆప్‌వైపు మళ్లారు. ఢిల్లీ గేట్, జామా మసీద్, దర్యగంజ్ వార్డుల్లోనూ 2017లో విజయం సాధించిన కాంగ్రెస్...ఈ సారి ఈ మూడు వార్డులనూ కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతాల్లో ఆప్ విజయం సాధించింది. ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్, నైరుతి ఢిల్లీలోని ఆయా నగర్‌తో పాటు ఆగ్నేయ ఢిల్లీలోని జకీర్ నగర్‌లో మాత్రమే మరోసారి విజయం సాధించింది. బ్రిజ్‌పురిలోనూ మళ్లీ గెలిచింది. ఈ ప్రాంతాల్లో మాత్రం 60% ఓటు షేర్‌ని రాబట్టుకుంది.
అప్పటి నుంచే సమస్యలు..
నిజానికి...కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎప్పుడైతే ఆప్ ప్రభంజనం మొదలైందో... అప్పటి నుంచి ఆమెను పార్టీ నుంచి పక్కకు పెట్టడం మొదలు పెట్టింది అధిష్ఠానం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్‌కు నాయకత్వ లేమి కొనసాగుతూనే ఉంది. 2002 నుంచి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది కాంగ్రెస్. అంతే కాదు.
ఢిల్లీలో 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నప్పటికీ...అది ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపించలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆఫీస్‌కి తాళం..
ఈ ఎన్నికలతో భారీగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. అసలు...ఆ పార్టీ ఊసు కూడా ఎత్తకుండానే ఎన్నికలు జరిగిపోయాయంటే.. అతిశయోక్తి కాదు. ఓ వైపు ఢిల్లీ ప్రజలంతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే...కాంగ్రెస్ ఆఫీస్ మాత్రం వెలవెలబోయింది. పార్టీ ఆఫీస్‌కి తాళం వేసి ఉంది. ఒక్క కార్యకర్త కూడా ఆ చుట్టుపక్కల కనిపించడం లేదు. కనీసం...కాంగ్రెస్ సపోర్టర్స్
కూడా అక్కడ కనిపించడం లేదు. గేటుకి తాళం వేసి వెళ్లిపోయారు. ఇది చూసిన వాళ్లంతా "ఇదేం చిత్రం" అనుకుంటూ వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ నిరాశావాదానికి ఇదే సాక్ష్యం అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ...కాంగ్రెస్ పతనమవుతూ వస్తోంది. ఇప్పటికే...గుజరాత్ ఎన్నికల్లో ఆప్ కన్నా వెనకబడి ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ముందుగా ఊహించినట్టుగానే...హస్తం పార్టీ చతికిలపడింది.
Also Read: కేజ్రీవాల్ "నేషనల్ ప్లాన్" వర్కౌట్ అవుతుందా? ఈ గెలుపుతో రూట్ క్లియర్ అయినట్టేనా!