(Source: ECI/ABP News/ABP Majha)
Air Canada: విమానంలో వింత ప్రవర్తన, టేకాఫ్ అయ్యే ముందు డోర్ తెరిచి కిందకి దూకిన వ్యక్తి
Air Canada: కెనడాలో ఓ వ్యక్తి విమానం టేకాఫ్ అయ్యే ముందు డోర్ తెరిచి కిందకి దూకాడు.
Air Canada News: Air Canada ఫ్లైట్ డోర్ తెరిచి ఓ వ్యక్తి కిందకి దూకిన ఘటన సంచలనమైంది దుబాయ్‌లో సరిగ్గా టేకాఫ్ అయ్యే సమయంలో ఉన్నట్టుండి కిందకి దూకి సిబ్బందికి ముచ్చెమటలు పట్టించాడు. అందరిలాగే విమానంలోకి వచ్చిన ఆ వ్యక్తి హఠాత్తుగా ఇలా వింతగా ప్రవర్తించడం చూసి అందరూ షాక్ అయ్యారు. Toronto Pearson International Airportలో ఈ నెల 8వ తేదీన ఈ ఘటన జరిగింది. సీట్‌లో కూర్చోడానికి బదులు క్యాబిన్ డోర్ తెరిచి దూకాడు. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోవడం వల్ల గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది అంతా అప్రమత్తమై ఆ వ్యక్తిని పైకి లేపారు. తరవాత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా ఫ్లైట్ దాదాపు ఆరు గంటల పాటు అక్కడే నిలిచిపోయింది. ఆ తరవాత టేకాఫ్ అయింది. జనవరి 8వ తేదీన టొరంటో నుంచి దుబాయ్‌కి వెళ్లాల్సిన బోయింగ్ 747 ఫ్లైట్ టేకాఫ్‌కి సిద్ధమైంది. ఆ సమయంలోనే ఓ ప్రయాణికుడు క్యాబిన్ డోర్ తెరిచాడు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ఆ వ్యక్తి కిందకి దూకాడు. ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే....ఆ వ్యక్తి ఎందుకలా చేశాడో ప్రస్తుతానికి తెలియలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.
గతేడాది ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఊహించని ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓ ప్రయాణికుడు అనాలోచిత చర్యతో మిగతా ప్రయాణికులంతా భయంభయంగా గడపాల్సి వచ్చింది. ఒక్కరు చేసిన పనికి మిగతా ప్రయాణికుల్లో కలకలం రేగింది. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరిన ఇండిగో విమానం 6E 6341 లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఢిల్లీ నుంచి చెన్నైకు వెళ్తున్న ఇండిగో విమానం మరికొద్ది సేపట్లో చెన్నైలో ల్యాండ్ అవుతుంది అనగా.. విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొందరు గట్టిగా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దాంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమాన సిబ్బంది అప్రమత్తతతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో విమానం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవగానే.. ఎమర్జెన్సీ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని విమాన సిబ్బంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. సదరు ప్రయాణికుడిని మణికందన్ గా అధికారులు గుర్తించారు. అతడిపై ఇండిగో సిబ్బంది ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.