Russia Flu Outbreak: బంకర్‌లో దాక్కున్న రష్యా అధ్యక్షుడు పుతిన్!
Russia Flu Outbreak: రష్యా వ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను బంకర్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.
Russia Flu Outbreak: ఉక్రెయిన్ యుద్ధంతో టెన్షన్‌లో ఉన్న రష్యా నెత్తిన మరో సమస్య వచ్చిపడింది. రష్యాలో మరోసారి ఫ్లూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అధ్యక్ష భవనంలోని అధికారులకు కూడా ఈ అంటువ్యాధి సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను బంకర్‌లోని ఐసోలేషన్‌కు తరలించినట్లు సమాచారం.
డేంజర్
రష్యాలో ఫ్లూ వ్యాప్తి ఎక్కువైనట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. చాలా మంది అధికారులు కూడా ఫ్లూ బారినపడటంతో పార్లమెంటు ఎగువసభలో ప్రసంగానికి పుతిన్ దూరంగా ఉండనున్నారని క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కాసేపటికే అధ్యక్షుడు పుతిన్‌ను పౌరులకు దూరంగా ఉంచేందుకు బంకర్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో భారీ స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు రష్యా ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్ గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల పుతిన్ గురించి షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి పుతిన్ (70) జారిపడినట్లు న్యూయార్క్ పోస్టు వెల్లడించింది.
పుతిన్ మెట్లు దిగుతుండగా కాలు జారడంతో ఐదు మెట్లకు కింద పడిపోయినట్లు తెలిపింది. దీంతో పుతిన్ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొంది. దీనికారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అయితే దీనిపై క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పుతిన్ రక్షణ సిబ్బందితో సన్నిహిత సంబంధాలున్న ఓ టెలిగ్రామ్ ఛానెల్ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా న్యూయార్క్ పోస్ట్ ఉటంకించింది.
రంగు మారిన చేతులు
పుతిన్ ఆరోగ్యం గురించి వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. ఆయన క్యాన్సర్ బారిన పడినట్లు, తీవ్ర అనారోగ్యంగా ఉన్నట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇటీవల క్యూబా అధ్యక్షుడు మిగుయేల్ డియాజ్‌తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా వారిద్దరూ కరచాలనం చేసుకుంటున్న సందర్భంలో తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఫొటోలో పుతిన్ చేతులు పర్పుల్ రంగులో ఉన్నాయి. దీనిపై బ్రిటన్ ఆర్మీ మాజీ అధికారి, హౌస్ సభ్యుడు లార్డ్స్ రిచర్డ్ దనత్ కూడా స్పందించారు. చేతులపై ఉన్న మచ్చలను నిశితంగా పరిశీలిస్తే.. ఇంజక్షన్ సూదులు గుచ్చడం వల్ల ఏర్పడినట్లుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. దానివల్లే బహుశా చేతులు రంగుమారి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Also Read: ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ- రాజస్థాన్ సర్కార్ ప్రకటన