Lok Sabha Election Results 2024: కాంగ్రెస్ దశ తిరిగిపోయినట్టేనా! పదేళ్ల తరవాత 100 మార్క్‌కి చేరువగా పార్టీ
Lok Sabha Election Results 2024: దాదాపు పదేళ్ల తరవాత కాంగ్రెస్ పార్టీ 100 మార్క్‌కి చేరువవుతుండడం ఆసక్తికరంగా మారింది.
Election Results 2024: బీజేపీ హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. చాలా ఏళ్లుగా ఈ కామెంట్స్ వినబడుతూనే ఉన్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. అసలు ప్రతిపక్ష హోదాకీ ఈ పార్టీ పనికి రాదన్న విమర్శలూ ఎదుర్కొంది. కానీ...ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆ పార్టీ దశను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ఆధారంగా చూస్తే కాంగ్రెస్ సొంతగా దాదాపు 100 చోట్ల లీడ్‌లో దూసుకుపోతోంది. NDA అభ్యర్థులనూ వెనక్కి నెట్టి ముందంజలో ఉంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ 100 మార్క్‌కి దరిదాపుల్లో కూడా లేదు కాంగ్రెస్. కానీ ఈ సారి గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. గత ఫలితాలను ఓ సారి గుర్తు చేసుకుంటే..2014లో 44 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, 2019లో 52 స్థానాలకు పరిమితమైంది.
2014లో మోదీ వేవ్‌లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. దాదాపు 162 స్థానాలు కోల్పోవడంతో పాటు 9.3% ఓటు శాతాన్నీ కోల్పోయింది. హిందీ బెల్ట్ అయిన గుజరాత్, రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్..ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పైచేయి సాధించింది. 2014లో బీజేపీ కూటమి ఈ రాష్ట్రాలను స్వీప్ చేసి ఏకంగా 336 స్థానాలు గెలుచుకుంది. సొంతగా 282 చోట్ల గెలిచింది. ఈ సారి ఈ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు చోట్ల కాంగ్రెస్ లీడ్‌లోకి రావడం, అటు ఇండీ కూటమి కూడా పుంజుకోవడం వల్ల బీజేపీకి ఆ స్థాయిలో సీట్లు వస్తాయా రావా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.