Kerala Schools: నాన్న వంట చేస్తే నామోషీ ఏమీ కాదు, ఆలోచింపజేస్తున్న కేరళ ప్రభుత్వం - స్కూల్ బుక్స్‌లో కార్టూన్స్
Kerala Schools News: లింగ సమానత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా కేరళ ప్రభుత్వం బుక్స్‌లో ప్రత్యేక కార్టూన్స్ వేయించింది.
Kerala News in Telugu: వంట అమ్మ మాత్రమే చేయాలా..? నాన్న ఎందుకు చేయకూడదు..? వంట గదిలోకి నాన్న వస్తే తప్పేముంది..? కూరగాయలు తరిగి ఇస్తే నామోషీ ఏంటి..? స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఇలా ప్రశ్నించాలని తెలియకపోవచ్చు. అసలు ఇలా కూడా ఆలోచించొచ్చు అని పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. కానీ...ఇలా అందరూ ఆలోచిస్తే..? అందరూ ప్రశ్నిస్తే..? లింగ సమానత్వం దానంతట అదే వస్తుంది. అందుకే కేరళ ప్రభుత్వం పిల్లలకు ఈ ప్రశ్నించడాన్ని అలవాటు చేస్తోంది. విద్యార్థి దశ నుంచే లింగ సమానత్వంపై అవగాహన కల్పిస్తోంది. అలా అని వాళ్లను గంటల కొద్దీ కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం కాదు. ఏకంగా పాఠాల్లోనే ఆ అంశాన్ని చేర్చింది. వాళ్లకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న కార్టూన్స్‌తో సూటిగా సుత్తి లేకుండా Gender Neutrality అంటే ఏమిటో వివరిస్తోంది కేరళ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోందంటే ఏ స్థాయిలో ఈ ఆలోచన ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
ఓ టెక్స్ట్ బుక్‌లో ప్రింట్ చేయించిన కార్టూన్ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఓ తండ్రి కిచెన్‌లో కూర్చుని కొబ్బరి తురుముతూ ఉంటే పక్కనే ఓ చిన్నారి నిలబడి చూస్తూ ఉన్నాడు. ఈ ఫొటో పెద్ద సంచలనమే సృష్టించింది. కిచెన్‌లోకి మగాళ్లు అడుగు పెట్టడమే గొప్ప అనుకుంటే ఏకంగా అక్కడ కూర్చుని వంటకు సాయం చేస్తున్నట్టుగా కార్టూన్ వేయడం ఆలోచింపజేసింది. సామాజిక సమస్యలపై పోరాడడంలో ఎప్పుడూ ముందుండే కేరళ అందుకే అక్షరాస్యతలో దూసుకుపోతోందని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
యునిఫామ్స్‌లోనూ లింగ సమానత్వమే..
ఇంటి పనులంటే కేవలం మహిళలే చేయాలన్న స్టీరియోటైప్ ఆలోచనల్ని బద్దలు కొట్టి అందరూ కలిసి పని చేయాలన్న స్పృహ విద్యార్థుల్లో కలిగిస్తోంది ప్రభుత్వం. కేవలం బుక్స్ విషయంలోనే కాదు. యునిఫామ్స్‌లోనూ ఇలాగే లింగ సమానత్వాన్ని పాటించేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది సర్కార్. సాధారణంగా స్కూల్ యునిఫామ్స్ (gender neutrality in kerala schools) అంటే అబ్బాయిలకు ఓ విధంగా, అమ్మాయిలకు మరో విధంగా ఉంటాయి. అబ్బాయిలు ప్యాంట్, షర్ట్‌లు, అమ్మాయిలు స్కర్ట్‌లు వేసుకుంటారు. ఇలా వేరు వేరుగా ఎందుకుండాలని ఆలోచించిన ప్రభుత్వం అమ్మాయిలకీ ప్యాంట్, షర్ట్‌లతోనూ యునిఫామ్ కుట్టించాలని ఆదేశించింది. మోకాలి వరకూ ఉండే ప్యాంట్‌లను యునిఫామ్‌లో చేర్చింది. ఇది కూడా స్థానికంగా చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకూ ఎప్పుడూ ఇలా ఎందుకు ఆలోచించలేదని ఎవరికి వాళ్లు ప్రశ్నించుకునేలా చేస్తోంది పినరయి సర్కార్. ఒక స్కూల్‌లో మొదలైన ఈ మార్పు ఆ తరవాత చాలా స్కూల్స్‌కి విస్తరించింది. క్రమంగా పదుల సంఖ్యలో బడుల్లో ఒకే రకమైన యునిఫామ్స్‌ని అందిస్తున్నారు.
ఇక అబ్బాయిలకు, అమ్మాయిలకు వేరువేరుగా కాకుండా కో ఎడ్యుకేషన్ స్కూల్స్‌నీ ప్రవేశపెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పిల్లల్లో ఎక్కడా వ్యత్యాసం కనిపించకుండా అందరూ కలిసి ఒకే చోట చదువుకునేలా ప్రోత్సహిస్తోంది. అంతే కాదు. స్కూల్స్ సర్, మేడమ్ అని కాకుండా అందరినీ టీచర్ అని విద్యార్థులు పిలిచేలా చొరవ చూపించింది. నాన్నలు ఒకప్పటిలా లేరు. వాళ్ల ఆలోచనా విధానం మారుతోంది. అమ్మతో పాటు సమానంగా ఇంటి పనుల్లో సాయం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఫాదర్స్ డే (Father's Day 2024) జరుపుకోనున్న క్రమంలో ఈ చర్చ ఇప్పటికే జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో కేరళ ప్రభుత్వం ఈ ఇనిషియేషన్ తీసుకోవడం ఆ చర్చకు మరింత బలాన్నిచ్చింది.
Also Read: Yogi Adityanath: రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు, బక్రీద్ పండుగపై యోగి సర్కార్ ఆంక్షలు