Yogi Adityanath: రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు, బక్రీద్ పండుగపై యోగి సర్కార్ ఆంక్షలు
UP CM Yogi Adityanath: బక్రీద్ పండుగ రోజున ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేస్తామంటే కుదరదని యోగి సర్కార్ తేల్చి చెప్పింది.
Bakri Eid: బక్రీద్ పండగను దృష్టిలో పెట్టుకుని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వీధుల్లో నమాజ్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ జంతు బలి చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిషేధం ఉన్న ప్రాంతాల్లో జంతు బలికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బలి ఎక్కడ ఇస్తారో ముందుగానే చెప్పాలని, అక్కడ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. వివాదాస్పద స్థలాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఈ బాధ్యత అధికారులదే అని తేల్చి చెప్పారు. అంతే కాదు. జంతు బలి ఇచ్చిన ప్రాంతాల్లో నీటి వ్యర్థాల్ని సరైన విధంగా డిస్పోజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు యోగి. ఎక్కడా మత కలహాలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. శాంతి భద్రతలనూ అదుపులోకి ఉంచాలని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. జూన్ 16వ తేదీన హిందువులు గంగా దసరా పండుగ జరుపుకోనున్నారు. మరుసటి రోజు జూన్ 17న ముస్లింలు బక్రీద్ పండుగ చేసుకోనున్నారు. ఆ తరవాత జూన్ 22న హిందువులు కన్వర్ యాత్ర చేపట్టనున్నారు. ఈ మూడు పండుగలనూ దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలు కాపాడాలని తెలిపారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటూ అన్ని ప్రాంతాల్లోనూ నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
బక్రీద్ వేడుకల నిబంధనలు ఇవే..
జంతు బలి ఎక్కడ ఇస్తారనేది ముందుగానే అధికారులకు తెలియజేయాలి. వివాదాస్పద స్థలాలు, సున్నిత ప్రాంతాల్లో జంతు వధ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఈ విషయంలో అధికారులు ఓ ప్లాన్ ప్రకారం నడుచుకోవాలి. ఎక్కడా సమస్యలు రాకూడదు. నమాజ్ కూడా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కుదరదు. నిర్దేశిత ప్రాంతాల్లోనే ప్రార్థనలు చేయాలి. రోడ్‌లు బ్లాక్ చేసి నమాజ్ చేయడానికి వీల్లేదు. విశ్వాసాలను గౌరవించడం సరైందే అయినప్పటికీ ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడం కుదరదని తేల్చి చెబుతోంది యోగి సర్కార్. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన శిక్షలు విధిస్తారు.
Also Read: బీజేపీకి గర్వం తలకెక్కింది, ఆ రాముడే మెజార్టీ రాకుండా అడ్డుకున్నాడు - RSS నేత సంచలన వ్యాఖ్యలు