Kerala Landslides: వారం ముందే హెచ్చరించాం, ప్రభుత్వం పట్టించుకోలేదు - వయనాడ్ విపత్తుపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Wayanad Landslides: వయనాడ్‌లో విపత్తు ముంచుకొస్తుందని వారం రోజుల ముందే హెచ్చరించామని అమిత్ షా తేల్చి చెప్పారు. కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Wayanad News in Telugu: వయనాడ్ విపత్తుపై రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు హెచ్చరికలు ఇచ్చినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. జులై 23వ తేదీనే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని స్పష్టం చేశారు. కొండచరియలు విరిగి పడే ప్రమాదముందని, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుందని ముందే అప్రమత్తం చేశామని వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 180 మంది గల్లంతయ్యారు. కేరళలో భారీ వర్షాలు మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి 9 NDRF బృందాలను పంపినట్టు వివరించారు అమిత్ షా. కానీ కేరళ ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని సరైన సమయంలో అలెర్ట్ చేయలేదని, వాళ్లను వేరే చోటకు తరలించలేదని ఆరోపించారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించే ప్రమాదముందని తెలిస్తే వారం రోజుల ముందే అలెర్ట్ చేసే టెక్నాలజీ భారత్ వద్ద ఉందని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత ఉన్న నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటి అని తెలిపారు. కేరళ ప్రభుత్వం కాస్త ముందే అప్రమత్తమై ఉంటే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని అన్నారు. కేరళ ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వయనాడ్ విపత్తుని కచ్చితంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. (Also Read: Kerala Landslide: భారత్‌ని వెంటాడుతున్న వరుస విపత్తులు, వరదలు తుఫాన్లతో విధ్వంసం)
"జులై 23వ తేదీన మేం కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాం. కొండ చరియలు విరిగిపడే ప్రమాదముందని అప్రమత్తం చేశాం. 9 NDRF బృందాలను పంపాం. కానీ కేరళ ప్రభుత్వం ఏం చేసింది..? సరైన సమయంలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారా..? ఒకవేళ వాళ్లు ఆ పని చేసుంటే ఇంత మంది ఎందుకు చనిపోతారు..? 2016 లోనే ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల ముందే అలెర్ట్ చేసే టెక్నాలజీ మన దగ్గరుంది"
- అమిత్ షా, కేంద్రహోం మంత్రి
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "... Under this early warning system, on July 23, at my direction, 9 NDRF teams were sent to Kerala considering that there could be landslides... What did the Kerala government do? Were the people shifted? And if they were… pic.twitter.com/P29bTb2buk
— ANI (@ANI) July 31, 2024
ఇప్పటికే కేంద్రమంత్రి జార్జ్ కురియన్ అక్కడి పరిస్థితులు సమీక్షించేందుకు వెళ్లారు. రిలీఫ్ క్యాంప్‌లలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోందో సమీక్షించారు. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి 160 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం అందింది. అయితే..ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారని వెల్లడించారు.
Also Read: Wayanad Landslides: వయనాడ్ విధ్వంసానికి కారణమిదే, మరో రెండు రోజుల పాటు ఇదే బీభత్సం!