Wayanad Landslides: వయనాడ్ విధ్వంసానికి కారణమిదే, మరో రెండు రోజుల పాటు ఇదే బీభత్సం!
Wayanad Landslide News: వయనాడ్‌లో విపత్తు సంభవించడానికి కారణమేంటో సైంటిస్ట్‌లు వివరిస్తున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం వల్లే ఈ స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు.
Wayanad Landslides: వయనాడ్‌లో ఈ స్థాయిలో కొండ చరియలు విరిగి పడడానికి (Wayanad Landslides Reasons) కారణమేంటో సైంటిస్ట్‌లు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. అరేబియన్ సముద్రం విపరీతంగా వేడెక్కెడం వల్లే ఈ విపత్తు సంభవించిందని చెబుతున్నారు. భారీగా మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా కేరళలో కుండపోత వానలు కురిశాయని వివరిస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి ఇదే కారణమని అంటున్నారు. అనూహ్య స్థాయిలో వర్షాలు కురవడం వల్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకూ 150 మందికి పైగా మృతి (kerala landslide death toll) చెందగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది బాధితులు చిక్కుకున్నారు. దాదాపు రెండు వారాలుగా అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఫలితంగా మట్టి బాగా మెత్తబడింది. వయనాడ్‌తో పాటు క్యాలికట్, మలప్పురం, కన్నూర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం (Wayanad rescue operation) నమోదైంది. ఈ అన్ని చోట్లా కొండ చరియలు విరిగి పడ్డాయి. 2019 సమయంలో కేరళ భారీ వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో మేఘాలు ఎలా అయితే కుండపోత కురిపించాయో ఇప్పుడూ వాతావరణ పరిస్థితి అలాగే ఉందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. అరేబియన్ సముద్రం మీద మేఘాలు కమ్ముకుంటున్నాయని, ఒక్కోసారి ఈ మేఘాలే కేరళ వైపు మళ్లి ఇలా బీభత్సం సృష్టిస్తాయని వివరించారు. (Also Read: Wayanad Landslides: భయమే వాళ్లను కాపాడింది, తృటిలో చావు నుంచి తప్పించుకున్న కుటుంబం)
Kerala | Wayanad Landslide | Union Minister George Kurien took stock of the rescue operation underway in the area where landslides occurred yesterday. pic.twitter.com/88IlhVwvPi
— ANI (@ANI) July 31, 2024
"అరేబియన్ సముద్రం తీవ్ర స్థాయిలో వేడెక్కుతోంది. అందుకే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతోంది. మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. ఇవే మేఘాలు కేరళ వైపు వస్తున్నాయి. ఆ సమయంలోనే ఇలా కుండపోత వానలు కురుస్తున్నాయి. వాతావరణంలో ఈ స్థాయిలో మార్పులు అందుకే వస్తున్నాయి. అంతకు ముందు మంగళూరులో ఈ తరహా వర్షాలు కురిసేవి. భారత్‌లోని పశ్చిమతీరంలో అనూహ్యంగా వర్షపాతం నమోదవుతోంది. ఫలితంగానే కేరళలోని పశ్చిమ కనుమల్లో ఈ ముప్పు ముంచుకొచ్చింది"
- సైంటిస్ట్‌లు
IMD వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి కొన్ని చోట్ల 30 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. మరో రెండు రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఇలాగే కొనసాగితే మరి కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడే ప్రమాదముంది. ఈ మేరకు NDRF బృందాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.