(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka Hijab Row: పాఠశాలల వద్ద 144 సెక్షన్- సోమవారం నుంచి స్కూల్స్ రీఓపెన్
సోమవారం నుంచి కర్ణాటకలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. దీంతో ఉడిపిలోని పాఠశాలల వద్ద 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా మూసివేసిన పాఠశాలలు సోమవారం తెరుచుకోనున్నాయి. దీంతో ఫిబ్రవరి 14-19 వరకు ఉడుపిలోని అన్ని ఉన్నత పాఠశాలల వద్ద సెక్షన్ 144 విధించింది ఆ జిల్లా యంత్రాంగం. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
పరిస్థితి చూసి
హిజాబ్ వివాదంతో అట్టుడుకిన కర్ణాటకలో మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలను తెరవడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని పాఠశాలలకు ఫిబ్రవరి 9న మూడు రోజుల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14 నుంచి పదో తరగతి వరకు పాఠశాలలను తెరవాలని నిర్ణయించింది.
మధ్యంతర ఉత్తర్వులు
హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టినప్పుడు విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులను ధరించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిజాబ్ లేదా కాషాయ కండువా ఇలా.. ఏదీ ధరించవద్దని పేర్కొంది. కోర్టులో ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్నంతవరకు ఇది పాటించాలని ఆదేశించింది.
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.