Karnataka Elections 2023: రైతు కొడుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు రూ.2 లక్షల గిఫ్ట్, కుమారస్వామి కీలక ప్రకటన
Karnataka Elections 2023: రైతుల కొడుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయికి రూ. 2లక్షలు ఇస్తామని జేడీఎస్ నేత కుమారస్వామి హామీ ఇచ్చారు.
Karnataka Elections 2023:
ప్రచారం జోరు..
మరో నెల రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ యాక్టివ్ అయ్యాయి. ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్ అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చాలా రోజుల సస్పెన్స్ తరవాత బీజేపీ కూడా లిస్ట్ ప్రకటించింది. ప్రచారం ఊపందుకున్న క్రమంలో జేడీఎస్ నేత కుమారస్వామి ఆసక్తికర ప్రకటన చేశారు. ఇప్పుడీ ప్రకటన పైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల కొడుకుల్ని పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు రూ.2 లక్షల నజరానా అందిస్తామని ప్రకటించారు. కోలార్ జిల్లాలో పంచరత్న ర్యాలీలో పాల్గొన్న ఆయన...ఈ వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
"రైతుల కొడుకుల్ని పెళ్లి చేసుకోడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదు. చాలా మంది ఇదే విషయాన్ని నాతో ప్రస్తావించారు. ఈ సమస్యని తీర్చాలని అనుకుంటున్నాను. రైతుల కొడుకులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇవ్వాలి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమలు చేస్తాం. అబ్బాయిల ఆత్మగౌరవాన్ని కాపాడతాం"
- కుమార స్వామి, జేడీఎస్ నేత
టికెట్‌ల కోసం ఫైట్..
ఇప్పటికే ఓ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది జేడీఎస్. త్వరలోనే రెండో లిస్ట్‌నూ వెల్లడించనుంది. అయితే టికెట్‌ల విషయంలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత కుటుంబంలోనూ ఈ విభేదాలు తలెత్తుతున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ హసన్ నియోజకవర్గం టికెట్ కోసం మొండి పట్టు పడుతున్నారు. అయితే..కుమార స్వామి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవెగౌడ కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టినట్టు సమాచారం. అయినా...ఆ టికెట్ ఇచ్చేందుకు కుమారస్వామి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అందుకే మీటింగ్ మొదలైన పావుగంటకే భవాని రేవణ్ణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇరు వర్గాలు...దీనిపై మొండి వాదన వినిపిస్తున్నాయి. ఇక కుమారస్వామి తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక..జాతీయ పార్టీలన్నీ సపోర్ట్ కోసం తమ వద్దకే వస్తాయని అన్నారు. ఇప్పటికే జాతీయ పార్టీల హైకమాండ్‌లు తమతో టచ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
కాంగ్రెస్ దూకుడు
కర్ణాటక కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఇప్పటికే 124 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన ఆ పార్టీ..ఇప్పుడు రెండో విడత జాబితా విడుదల చేసింది. ఎన్నికల బరిలోకి దిగనున్న 42 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగిన తరవాత ఈ జాబితా విడుదల చేశారు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే పోటీ చేసే అవకాశమిస్తున్నట్టు ఖర్గే స్పష్టం చేశారు. గెలవకపోయినా... ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలిగే వారినే ఎంపిక చేస్తున్నామని తెలిపారు. మొదటి విడత జాబితాలో డీకే శివ కుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. గతంలోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా అదే స్థానాన్ని ఖరారు చేశారు.
Also Read: Amritpal Singh Poster: అమృత్ పాల్ ఆచూకీ చెప్పండి, నజరానా పట్టుకెళ్లండి - ప్రజలకు పోలీసుల ఆఫర్