Karnataka Election 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల ప్రచారం, మే 10వతేదీనే అసలు యుద్ధం
Karnataka Election 2023: కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది.
Karnataka Election 2023:
సాయంత్రం 5 గంటలకు ముగింపు
దాదాపు నెల రోజులుగా హోరాహోరీగా సాగిన కర్ణాటక ఎన్నికల ప్రచారం నేటితో (మే 8) ముగిసింది. సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి బ్రేక్ పడింది. మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండ్రోజుల పాటు ఏ పార్టీ కూడా ప్రచారం చేయడానికి వీల్లేదు. అసలు ఆ ఊసే ఎత్తకూడదు. పథకాలు ప్రకటించడంపైనా ఆంక్షలుంటాయి. 20 రోజులుగా కాంగ్రెస్, బేజేపీ పోటాపోటీగా ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌లుగా రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఇక బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఆకట్టుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు కర్ణాటకలో ప్రచారం చేశారు మోదీ. ఈ క్రమంలో 3 వేల మందితో ఇంటరాక్ట్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా కిలోమీటర్ల కొద్దీ ర్యాలీ నిర్వహించడమూ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచింది. భారీ ఎత్తున ప్రజలు తరలిరావడమూ పార్టీ శ్రేణుల్లో ధీమా పెంచింది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికే మరోసారి అవకాశమివ్వాలంటూ మోదీ ప్రచారం చేశారు. అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీపై విమర్శలు చేస్తూ ప్రచారం కొనసాగించింది.
వాడివేడి ప్రచారం..
క్యాంపెయినింగ్ చివరి దశకు చేరుకునే సమయానికి కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన తరవాత మాటల యుద్ధం పెరిగింది. బజ్‌రంగ్ దళ్ బ్యాన్ చేస్తామంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటన అగ్గి రాజేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలందరూ దీన్నే ప్రచార అంశంగా మలుచుకున్నారు. కాంగ్రెస్‌కు గురి పెట్టారు. చివరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించి "యూటర్న్" తీసుకోవాల్సి వచ్చింది. ఇది కొంత మేర కాంగ్రెస్‌పై ప్రభావం చూపించే అవకాశముంది. కాంగ్రెస్ బీజేపీపై "40% కమీషన్" ప్రభుత్వం అని విమర్శలు చేస్తూ ప్రచారం సాగించింది. బసవరాజు బొమ్మై పని తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది. అవినీతి ప్రభుత్వం అంటూ పదేపదే విమర్శలు చేసింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ ఇదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేశారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో భారత్ దేశాన్ని ప్రపంచం గుర్తించలేదని, తాము అధికారంలోకి వచ్చాకే దేశ ప్రతిష్ఠ పెరిగిందంటూ జాతీయవాదాన్ని నూరిపోశారు ప్రధాని. కాంగ్రెస్ హయాంలో మొత్తం స్కామ్‌లే జరిగాయని మండి పడ్డారు. బజ్‌రంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న హామీపైనా పరోక్షంగా విమర్శలు చేశారు. జై బజ్‌రంగ్ బలి అనే నినాదాలతో ప్రసంగాలు మొదలు పెట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు. అటు కాంగ్రెస్ కూడా ప్రధాని విమర్శలకు కౌంటర్‌లు ఇచ్చినా...ఖర్గే నోరు జారడం వల్ల కాస్త చెడ్డ పేరు మూట కట్టుకోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ విషసర్పం అంటూ ఖర్గే చేసిన కామెంట్స్ మిస్‌ఫైర్ అయ్యాయి. చివరకు ఆయనే వివరణ ఇచ్చుకున్నారు. ఇలా...వాడివేడిగా సాగింది ఎన్నికల ప్రచారం.
Also Read: Viral Video: మురికి కాలువలో కరెన్సీ నోట్లు,ఒక్కసారిగా ఎగబడ్డ గ్రామస్థులు - వైరల్ వీడియో