Junior Doctors Protest: రేపటి నుంచి జూడాల సమ్మె - 3 నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడంతో విధులకు హాజరుకాబోమని ప్రకటన
Telangana News: 3 నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు ఉపక్రమించారు. రేపటి నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు.
Junior Doctors Protest For Stifund: తెలంగాణలో (Telangana) జూనియర్ డాక్టర్లు (Junior Doctors) సమ్మెకు పిలుపునిచ్చారు. గత 3 నెలలుగా స్టైఫండ్ (Stifund) ఇవ్వకపోవడంతో ఈ నెల 19 (మంగళవారం) నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ కు నోటీసులిచ్చారు. హౌస్ సర్జన్లు, జూనియర్ వైద్యులు, ఎస్ఆర్ లు ఇలా దాదాపు 10 వేల మంది వైద్య విద్యార్థులున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్ షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు సుమారు 2,500 మంది, దాదాపు 4 వేల మంది పీజీ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు (జూనియర్ డాక్టర్లు), మరో 2 వేల మంది సీనియర్ రెసిడెంట్లు, 1,500 మంది వరకూ సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఉన్నారు. కాగా, హౌస్ సర్జన్లకు నెలకు రూ.26 వేలు, పీజీ స్పెషాలిటీ వారికి తొలి ఏడాది రూ.58 వేలు, రెండో ఏడాది రూ.61 వేలు, మూడో ఏడాది రూ.65 వేలు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు రూ.92 వేల నుంచి రూ.లక్ష వరకూ ప్రభు్తవం స్టైఫండ్ రూపంలో చెల్లిస్తోంది. అయితే, గత 3 నెలలుగా స్టైఫండ్ బకాయిలు చెల్లించలేదని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూనియర్ వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం డీఎంఈ రమేశ్ రెడ్డి ప్రకటించారు.
'అప్పుల భారాన్ని మోయలేకున్నాం'
'అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే పీజీ వైద్య విద్యార్థులకిచ్చే స్టైఫండ్ తక్కువగా ఉంది. 3, 4 నెలలకోసారి స్టైఫండ్ విడుదల చేస్తే అప్పుల భారాన్ని మోయలేకపోతున్నాం. పీజీ చేస్తున్న వారిలో అత్యధికులకు పెళ్లిళ్లయ్యాయి. ఇళ్లు, వాహన రుణ వాయిదాలు కట్టలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.' అని జూడాల అధ్యక్షుడు కౌశిక్ కుమార్ తెలిపారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
కాగా, జూడాల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. గాంధీ ఆస్పత్రిలో రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
అయితే, ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్ లోనూ జూనియర్ వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా జూడాలు ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి, దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న వైద్య విద్యార్థులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. రిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న క్రాంతి కుమార్ కొందరి బయటి వ్యక్తులను తీసుకొచ్చి మెడికోలపై దాడికి పాల్పడగా పలువురికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో జూడాలు ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా, కలెక్టర్ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. రిమ్స్ యాజమాన్యం దాడికి పాల్పడిన ప్రొఫెసర్ ను టర్మినేట్ చేయగా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కమిటీతో చర్చలు సఫలం కాగా ఈ నెల 16న జూడాలు సమ్మె విరమించారు.