Telangana news: 'ఆర్టీసీ బస్సులపై దాడి అంటే సమాజంపై దాడే' - అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు శ్రేయస్కరం కాదన్న సజ్జనార్, ఘటనపై కేసు నమోదు
Biggboss 7 Finale Incident: బిగ్ బాస్ 7 సీజన్ ఫైనల్ సందర్భంగా ఆర్టీసీ బస్సుపై దాడి ఘటనకు సంబంధించి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు తగవని ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Police Complaint Against Attack on RTC Bus During Biggboss 7 Grand Finale: బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) లోని కృష్ణానగర్ (Krishnanagar) అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studios) సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సులపై కొందరు ఆకతాయిలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో (Jubileehills Police Stations) ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 6 బస్సులు, పోలీస్ వాహనం, 2 ప్రైవేట్ వాహనాలపై అభిమానులు దాడులు చేసి ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.
ఎండీ సజ్జనార్ ఏమన్నారంటే.?
ఆర్టీసీ బస్సుపై దాడి ఘటనను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'అభిమానం పేరుతో చేసే పిచ్చిచేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ ఏమాత్రం ఉపేక్షించదు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.' అంటూ ట్వీట్ చేశారు.
ఇదేం అభిమానం!
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q
ఇదీ జరిగింది
‘బిగ్ బాస్’ సీజన్ 7 ఫైనల్ ఈవెంట్ ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. షో ముగిసిన తర్వాత వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. వీరిని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు యత్నించినా సాధ్యం కాలేదు. కాగా, ఇదే సమయంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. స్టూడియో నుంచి బయటకు వస్తున్న ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్, ఇతర సెలబ్రిటీల కార్లపై రాళ్లు విసిరారు. చేతికి అందిన వస్తువులతో కార్ల అద్దాలను పగలగొట్టారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రశాంత్, అమర్ అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకుంటూ అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న కొండాపూర్ - సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సుపైనా దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలు పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. భద్రత మధ్య సెలబ్రిటీలను అక్కడి నుంచి తరలించారు. సెలబ్రిటీల కార్లపై దాడి, ఆర్టీసీ బస్సుపై దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటను ఆటగా చూడాలని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, ఈ దాడి ఘటనపై సెలబ్రిటీలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.