J&K - G-20 Summit: జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఆ సదస్సు, ఎందుకో తెలుసా?
2023లో జరగనున్న జీ20 సదస్సుని జమ్ము, కశ్మీర్‌లో నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించింది.
జమ్ముకశ్మీర్‌లో జీ-20 సదస్సు జరగనుందా?
జమ్ముకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్నదేశాలు సమావేశమై తమ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడిస్తుంటాయి. అయితే ఈ సారి జమ్ము,కశ్మీర్ వేదికగా ఈ అత్యున్నత భేటీ జరిపేందుకు కేంద్రం మంతనాలు జరుపుతోంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా నియమించింది. 2023లో జరగనున్న ఈ సమ్మిట్‌నువిజయవంతం చేయాలని భావిస్తోంది. కమిటీలోని ఐదుగురు సభ్యులు మిగతా దేశాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సమావేశాన్ని ప్లాన్ చేయనున్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గతేడాది జీ20 సమావేశానికి భారత ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది జీ 20 సమావేశానికి భారత్ తరపున ఎవరు అధ్యక్షత వహిస్తారో డిసెంబర్ 1వ తేదీన నిర్ణయిస్తామని వెల్లడించారు భారత విదేశాంగ మంత్రి. 2023లో జీ20 సమ్మిట్‌ను భారత్ నిర్వహించనుందని స్పష్టం చేశారు.
ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ నియామకం
ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్ము కశ్మీర్‌లో జరిగే తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే అవనుంది. గృహ, పట్టణాభివృద్ధి విభాగానికి చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ కుమార్ ద్వివేది..కేంద్రం నియమించిన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జూన్ 4వ తేదీనే ఈ కమిటీని ఏర్పాటు చేసింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇకపై జీ 20 దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ సమ్మిట్ సక్సెస్ అయ్యేలా చూస్తానని వెల్లడించారు మనోజ్ కుమార్. ఈ కమిటీలో రవాణా శాఖకు చెందిన కమిషనర్ సెక్రటరీ, టూరిజం శాఖకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, హాస్పిటాలిటీ విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, సాంస్కృతిక విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకేనా..?
2014 నుంచి జరుగుతున్న జీ20 సమావేశాలకు భారత్ తరపున ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తూ వస్తున్నారు. 1999నుంచి జీ 20లోసభ్య దేశంగా ఉంది భారత్. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న 19 దేశాలతో పాటు ఐరోపా సమాఖ్యకు చెందినే దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 80%. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, భారత్, ఫ్రాన్స్, ఇండోనేషియా తదితర దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది కేంద్రం. అక్కడ పురోగతి సాధించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయ సమ్మిట్‌ను కశ్మీర్‌లో నిర్వహించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read: Maharashtra Political Crisis: థాక్రే ప్రభుత్వం కుప్ప కూలినట్టేనా, షిండే శిబిరాన్ని ఎవరూ కదపలేరా?
Also Read: Delhi Crime: అమ్మాయి ఫ్లాట్‌కు రమ్మనగానే వెళ్లిపోయాడు, ఆ తరవాత ఏమైందంటే