Indore: డౌన్‌సిండ్రోమ్ ముందు ఎవరెస్ట్ తలొంచింది-తండ్రితో కలిసి ఏడేళ్ల బాలుడి సాహసయాత్ర
Indore: డౌన్‌సిండ్రోమ్ ఉన్న కొడుకుని ఎవరెస్ట్ ఎక్కించాలని ఓ తండ్రి తపన పడ్డాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సాహస యాత్రను మొదలు పెట్టారు.
Boy With Down Syndrome Scales Mount Everest:
మెడిసిన్, ఆక్సిజన్ వెంట తీసుకుని..
డౌన్ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న ఓ ఏడేళ్ల బాలుడు ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు సాధించాడు. 18,200 అడుగులు ఎత్తుకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాడు అవనీశ్. డౌన్ సిండ్రోమ్ సమస్యతో బాధ పడుతూ ఎవరెస్ట్ ఎక్కిన తొలి బాలుడిగా చరిత్ర సృష్టించాడు. మధ్యప్రదేశ్‌లోని
ఇండోర్‌కు చెందిన అవనీశ్, అతడి తండ్రి ఆదిత్య తివారీతో కలిసి ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు సాహస యాత్రను ప్రారంభించారు. సుమారు 70 కిలోల బరువుతో ప్రయాణం మొదలు పెట్టారు తండ్రి కొడుకులు. వీటికి తోడు 10 కిలోల బరువైన ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు అవనీశ్‌కు అవసరమైన మెడిసిన్‌ను కూడా తీసుకెళ్లారు. దారి మధ్యలో అవనీశ్‌కు ఏమీ కాకూడదని ముందుగానే జాగ్రత్తపడి, మందులు తీసుకెళ్లాడు తండ్రి ఆదిత్య తివారీ. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అందుకే ఓ నెబ్యులైజర్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఎవరెస్ట్ ఎక్కేందుకు అవసరమైన శిక్షణను ముందుగానే ఇచ్చాడు. ఈ యాత్రకు ముందు, కొడుకు డైట్ ప్లాన్‌ను అంతా మార్చేశాడు ఆదిత్య. ఇండోర్‌లోని పలు కేంద్రాల్లో అవనీశ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎవరెస్ట్‌పై ఉన్న వాతావరణ పరిస్థితులను ఎలా తట్టుకోవాలనే అంశంపై వీరికి శిక్షణనిచ్చారు.
సమాజం దృష్టిని మార్చాలనే ఉద్దేశంతోనే...
"గతంలో ఈ వయసు ఉన్న డౌన్‌సిండ్రోమ్ పిల్లలెవరూ ఎవరెస్ట్ ఎక్కలేదు. ఆ వయసులో ఏ పిల్లలైనా సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తు వరకూ వెళ్లటమే కష్టం. అంతకు మించి వెళ్తే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి" అని వివరించారు ఆదిత్య తివారీ. ఈ ఫీట్ చేయటం ద్వారా పిల్లలందరికీ స్ఫూర్తిగా నిలిచాడు అవనీశ్. ఆదిత్య తివారీ, అవనీశ్‌ను ఐదేళ్ల క్రితం దత్తత తీసుకున్నాడు. ఓ 26 ఏళ్ల పెళ్లికాని కుర్రాడు డౌన్‌సిండ్రోమ్‌తో బాధ పడుతున్న పిల్లాడిని దత్తత తీసుకోవటంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ప్రస్తుతం ఆ బాలుడికి శిక్షణనిస్తూ అథ్లెట్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అవనీశ్ స్పెషల్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ఇలాంటి పిల్లలను ప్రపంచం వింతగా చూస్తుంది. ఆ చూసే కోణంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అవనీశ్‌తో ఈ రికార్డు సాధించానని చెప్పాడు ఆదిత్య తివారీ. అలాంటి మెడికల్ కండీషన్‌లో ఉన్న పిల్లాడితో ట్రెకింగ్ చేయటం కష్టమైన పనే అయినప్పటికీ...పట్టుదలతో ముందుకు సాగామని వివరించాడు. ఉష్ణోగ్రతతో పాటు ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండే ఆ ఎత్తుకు వెళ్లాలన్న సాహసం చేయాలని గట్టిగా అనుకున్నాకే, ప్రయాణం మొదలు పెట్టానని చెప్పాడు.