Bharat Ratna: అసలు ఎవరీ కర్పూరి ఠాకూర్? ఆయనకు భారతరత్న ఎందుకు ప్రకటించారో తెలుసా?
Jan Nayak: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం పోరాడిన బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు దేశ అత్యున్నత పురష్కారం దక్కింది.
Karpoori Thakur: దివంగత నేత, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ (Karpoori Thakur) (1924-1988)ను దేశ అత్యున్నత పురష్కారం వరించింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం కర్పూరీ ఠాకూర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేస్తూ మంగళవారం రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
1970వ దశకంలో రెండు సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్.. జన నాయక్(జననేత)గా గుర్తింపుపొందారు. రాజకీయంగా అగ్రకులాలు ఆధిపత్యం వహించే బీహార్‌లో ఓబీసీల రాజకీయాలకు ఆయన నాంది పలికారు. మొదటిసారిగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ యేతర సోషలిస్టు నాయకుడు కూడా కర్పూరి ఠాకూరే కావడం విశేషం. భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతల్లో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీకి 2019లో ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి, సమానత్వం, సాధికారత కోసం కర్పూరి ఠాకూర్ తిరుగులేని నిబద్ధతతో పనిచేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, విజనరీ నాయకత్వం ద్వారా దేశ సామాజిక-రాజకీయ నిర్మాణంలో ఆయన చెరగని ముద్ర వేశారని అన్నారు. సామాజిక న్యాయం అనే పదానికి చిహ్నంగా నిలిచారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు.
స్వాతంత్ర్య పోరాటం
కర్పూరి ఠాకూర్ 1924, జనవరి 24న నాయీ బ్రాహ్మణ సామాజికవర్గంలో జన్మించారు. ఆయన తండ్రి సన్నకారు రైతుగా ఉండేవారు. యుక్త వయసులో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1942-1945 మధ్య క్విట్ ఇండియా ఉద్యమంలో 26 నెలల పాటు జైలు జీవితం గడిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1952లో తొలిసారిగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజ్‌పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1967-68 మధ్య రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా సేవలందించారు.
ఠాకూర్ తన రాజకీయ జీవితంలో అనేక మైలురాళ్లను అధిగమించారు. ముఖ్యమంత్రి అవకముందు ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. 1970లో రాష్ట్ర మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు అప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న మద్యపాన నిషేధిస్తూ బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. అంతేకాకుండా విద్యకు ప్రధాన్యత ఇస్తూ.. పాఠశాలలు, కళాశాలలను స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించారు. బీహార్‌లో అభివృద్ధి చెందని ప్రాంతాలు, అట్టడుగు ప్రజలకు విద్య అందుబాటులోకి వచ్చేలా చేశారు.
బిహార్‌లో రిజర్వేషన్ల అమలుకు ఆద్యుడు
స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన రామ్ మనోహర్ లోహియా వంటి వ్యక్తుల నుంచి కర్పూరి ఠాకూర్ స్ఫూర్తి పొందారు. తర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) అభ్యున్నతిపై ఆయన తీవ్రంగా ఆలోచించేవారు. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. 1990 మండల్ కమిషన్‌కు ముందుగానే 1977లో ముంగేరి లాల్ కమిషన్ నివేదిక మేరకు 9178లోనే ముస్లింలలోని బలహీన వర్గాలతో సహా వెనుకబడిన తరగతుల వారి కోసం రిజర్వేషన్లు అమలు చేశారు.
ఠాకూర్ బీహార్ విద్యా మంత్రిగా ఉన్నప్పుడు మెట్రిక్యులేషన్ స్థాయిలో ఇంగ్లిష్‌ను తప్పనిసరి సబ్జెక్ట్ నుంచి తొలగించారు. విద్యాపరంగా వెనుకబడినవారిని ప్రోత్సహిస్తూ, ఉన్నత విద్యను అభ్యసించేలా ఆయన కృషి చేశారు. కర్పూరీ ఠాకూర్ విధానాలు ఇప్పటికి బీహార్‌లో కనిపిస్తాయి. వెనుకబడిన తరగతుల సాధికారతకు ఆయన చేసిన పోరాటం నేడు జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీల ఏర్పాటుపై ప్రభావం చూపింది.
లాలూ, నితీశ్, పాశ్వాన్‌లకు గురువు
బీహార్‌లో ఓబీసీ రాజకీయాలకు పునాది వేసిన వారిలో కర్పూరి ఠాకూర్ ప్రథములు. జయప్రకాశ్ నారాయణ్ ఇచ్చిన పిలుపుతో ఎంతో మంది ఉద్యమంలోకి రాగా.. అలా వచ్చిన వారిలో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, రాంవిలాస్ పాశ్వాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్ 1988, ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు.