Viral News: డాల్ఫిన్ దొరికిందని కూర వండుకుని తిన్నారు! కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి అరెస్ట్
Viral News: యమునా నదిలో దొరికిన డాల్ఫిన్ ను వండుకుని తిన్న మత్స్యకారులను పోలీసులు అరెస్టు చేశారు.
Viral News: యమునా నది ఒప్పొంగి ప్రవహిస్తుంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. ఈ క్రమంలో యమునా నదిలో రకరకాల చేపలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ కనిపించనన్ని చేపలు ప్రస్తుతం ప్రవాహంలో కనిపిస్తున్నట్లు యమునా పరీవాహక ప్రాంతాల ప్రజలు అంటున్నారు. యమునా నదిలో డాల్ఫిన్లు కూడా కనిపిస్తుండటం విశేషం. ఈ క్రమంలో యూపీలోని కౌశంబి జిల్లా పిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు మత్స్యకారులకు డాల్ఫిన్ దొరికినట్లు కూడా వార్తలు వచ్చాయి.
యమునా నదిలో దొరికిన డాల్ఫిన్ ను కొందరు మత్స్యకారులు పట్టుకుని ఇంటికి తీసుకెళ్లి కూర వండుకుని తినడం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి మత్స్యకారులు డాల్ఫిన్ ను మోసుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నసీర్ పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులపై కౌశంబి జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు పిపరీ పోలీసు అధికారి శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు. సదరు మత్స్యకారులు తమ వలలో పడిన డాల్ఫిన్ ను ఇంటికి తీసుకెళ్లి, కూర వండుకుని తిన్నారని రవీంద్ర కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. నలుగురు మత్స్యకారులు డాల్ఫిన్ ను మోసుకెళ్తుండటాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని, దానిపై విచారణ జరిపి, రంజీత్ కుమార్, సంజయ్, దీవన్, బాబాలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో రంజీత్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు పరారీ ఉండగా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
All arrested for poaching of endangered gangetic dolphin from Yamuna near Prayagraj recently. pic.twitter.com/nim7gPuItu
— Anup Nayak (@AnupKNayak) July 25, 2023
ఢిల్లీలో కొనసాగుతున్న యమునా నది ఉద్ధృతి
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ఉరకలు వేస్తోంది. ఆదివారంతో పోలిస్తే నీటిమట్టం స్థాయి కాస్త ఎక్కువగానే ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలోనే ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించింది. ఓల్డ్ యమునా బ్రిడ్జ్ సమీపంలో నది డేంజర్ మార్కు దాటడంతో తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ నుంచి షహదారా మధ్య రాకపోకలు సాగించే రైళ్లను కూడా రద్దే చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు.