Uttarkashi Tunnel Collapse: సిల్కియారా టన్నెల్‌లో ఆగిపోయిన డ్రిల్లింగ్, తరువాత ప్లాన్ ఏంటంటే!
Rescue Operation In Uttarkashi tunnel : ఉత్తరకాశీ సిల్కియారా టన్నెల్‌లో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించడానికి అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.
Rescue Operations In Uttarkashi Tunnel: ఉత్తరకాశీ (Uttarkashi) సిల్కియారా టన్నెల్ (Silkyara Tunnel)లో చిక్కుకున్న 40 మంది కార్మికులను రక్షించడానికి అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation)లో భాగంగా శిథిలాల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
గత రాత్రి 900 మిమీ వ్యాసం ఉన్న ఉక్కు పైపులను శిథిలాలలోకి చొప్పించారు. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు అధునాతన ఆగర్ డ్రిల్లింగ్ మెషిన్ (Auger Drilling Machine) సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను 21 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసిందని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లోని సిల్క్యారా కంట్రోల్ రూమ్ తెలిపింది.
కూలిపోయిన శిథిలాలు గట్టిగా ఉన్నాయని, డ్రిల్లింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. కార్మికులను రక్షించేందుకు, విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు 24 టన్నుల బరువున్న అధిక సామర్థ్యం ఉన్న ఆగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని అధికారులు తెప్పించారు. కార్మికులను చేరుకోవడానికి దాదాపు 45 నుంచి 60 మీటర్ల వరకు డ్రిల్లింగ్ కొనసాగించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అగర్ యంత్రం గంటకు 5 మీటర్లను డ్రిల్లింగ్ చేస్తుందని, గతంలోని యంత్రంతో పోలిస్తే అధిక సామర్థ్యం ఉన్నట్లు పేర్కొన్నారు.
రెస్క్యూ కార్యకలాపాలు ఆరో రోజుకు చేరుకోవడంతో కార్మికుల మానసిన ధైర్యం దెబ్బతినకుండా, వారికి ధైర్యం చెప్పేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కార్మికులతో మాట్లాడుతున్నారు. అలాగే వారికి పైపుల ద్వారా ఆహారం, నీరు, ఆక్సిజన్ అందిస్తున్నారు. పరిస్థితిని తెలుసుకోవడానికి వాకీ-టాకీల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. సొరంగం దగ్గర వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే సమీపంలోని ఆసుపత్రులను అధికారులు సిద్ధం చేశాు.
సహాయక చర్యలు కొనసాగుతుండగా కొండచరియలు విరిగిపడటం, డ్రిల్ యంత్రం ఫెయిల్ అవడంతో అధికారులు అధునాతన డ్రిల్లింగ్ పరికరాలను తెప్పించారు. ఈ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీ సైతం కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త డ్రిల్లింగ్ మెషీన్‌ను విమానంలో సైట్‌కు తరలించింది. అలాగే ఇలాంటి ఆపరేషన్లలో అనుభవం ఉన్న నార్వే, థాయిలాండ్ నిపుణులను సంప్రదిస్తున్నారు.
ఘటనాస్థలిని కేంద్ర మంత్రి వీకే సింగ్ పరిశీలించారు. రెస్క్యూ ప్రయత్నాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిక్కుకున్న వారందరిని రక్షించడం తమ బాధ్యత అన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల నుంచి సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ.. సంస్థ రెస్క్యూ ప్రయత్నాలను నిశితంగా పరిశీలిస్తోందని, సాధ్యమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఇంకొన్ని గంటలు వేచి చూస్తామని, రెస్క్యూ ఆపరేషన్‌లో ఎటువంటి పురోగతి లేకపోతే సహాయం అందించడానికి ప్రత్యేక బృందాలను పంపుతామన్నారు. ప్రపంచంలోని ప్రముఖ టన్నెలింగ్ దేశాల్లో భారతదేశం ఒకటని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. 40 మంది జీవితాలు చాలా ప్రమాదంలో ఉన్నాయని వారిని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సిల్కియారా - దండల్ గావ్ మధ్య టన్నెల్ నిర్మాణం
ఉత్తరకాశీ జిల్లాలో బ్రహ్మఖల్ యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుంచి దండల్ గావ్ వరకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న ఈ ఆల్-వెదర్ టన్నెల్ నిర్మాణం కారణంగా ఉత్తరకాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు ప్రయాణం 26 కిలోమీటర్లమేర తగ్గనుంది.
సిల్క్యారాలోని నాలుగున్నర కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ సొరంగంలో 150 మీటర్ల భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సొరంగం ఒక్కసారి కూలిపోవడంతో 40 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు.